పింఛన్‌ ఇక్కట్లకు చంద్రబాబే కారణం : బొత్స

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీన అందజేసిన సామాజిక పింఛన్లను ఈ నెల సకాలంలో పంపిణీ చేయకపోవడానికి టిడిపి అధినేత చంద్రబాబే కారణమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ నగరంలోని వైసిపి విశాఖ ఎంపి అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని పత్రికలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నాన్నారు. వారికి చంద్రబాబుతో సంబంధాలున్నాయని విమర్శించారు. సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ పేరుతో మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసిన నిర్వాకం అందరికీ తెలుసని, వలంటీర్లతో పింఛను పంపిణీ చేయడానికి వీల్లేదని ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇస్తున్నారని, ఇప్పుడు పంచాయతీ ఆఫీసుకి వెళ్లి పింఛను తెచ్చుకోవాలంటే వృద్ధులకు, వికలాంగులకు చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆంక్షల కారణంగా ఒకటో తేదీన పింఛన్లు అందలేదని, కానీ కొన్ని పత్రికలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పింఛన్లు పంపిణీ చేయడం లేదని తప్పుడు రాతలు రాయడం సరికాదని అన్నారు. వృద్ధులు, వికలాంగులకు నిమ్మగడ్డ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గతంలోనూ వలంటీర్లపై బురద జల్లారని అన్నారు. చంద్రబాబు దుర్బిద్ధి, నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసే పనుల వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని బొత్స పేర్కొన్నారు.

➡️