వైసీపీ వైధింపుల పర్వం ఆపాలి

Apr 6,2024 12:37 #Atchannaidu, #minorities, #YCP Govt

కింజరాపు అచ్చెన్నాయుడు 

ప్రజాశక్తి-మంగళగిరి : పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ వైధింపుల పర్వం కొనసాగుతుందని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నంద్యాలలో ముస్లిం యువతికి జరిగిన అవమానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. జగన్  పాలనలో ముస్లింలకు రక్షణ లేదని మండిపడ్డారు. శుక్రవారం నంద్యాలలో నమాజ్ చేసుకొని వస్తున్న మహిళపై వైసీపీ నాయకుడు, నందికొట్కూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి పరాభవానికి గురి చేశారని తెలిపారు. ముస్లింలను నమ్మకూడదంటూ ముస్లిం జాతినే అవమానించారని అన్నారు. ఆమె కుమారుడిపై దాడి చేయించారని తెలిపారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైసీపీ అభ్యర్ధి మగ్బూల్ బంధువు, మాజీ కౌన్సిలర్ వహీద అనే ముస్లిం మహిళపై చెప్పుతో దాడి చేసి అవమానించారని తెలిపారు. ఇలా రోజుకో చోట అవమానిస్తున్నారని పేర్కొన్నారు.  గతంలోను వైసీపీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అన్నారు. చిత్తూరు, పలమనేరులో మిస్బా ఆత్మహత్య చేసుకుందన్నారు. గత 5ఏళ్లల్లో ముస్లింలపై 60కి పైగా దాడులు, 15 మందికి పైగా అత్యాచారాలు, 9 మందిపై హత్యలు, వేలాది మందికి అవమానాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించి ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.

➡️