‘ఒడిమీను’ చేప చిక్కింది – జాలరి పంట పండింది..!

విశాఖ : మత్స్యకారుల వేట వలకు అప్పుడప్పుడు అరుదైన చేపలు చిక్కుతుంటాయి.. అప్పుడు వాటి గిరాకీ పెరుగుతుంది.. మత్స్యకారుల పంట పండుతుంది..! గతంలో ఓసారి.. తూర్పు గోదావరిలో జాలర్లకు అరుదైన చేప చిక్కింది. దాని కడుపులో ఉండే బ్లాడర్‌కు మంచి గిరాకీ ఉండడంతో ఈ చేప రూ.4.30 లక్షలకు పలికి కాకినాడలో అమ్ముడుపోయింది..! చేపలకుండే డిమాండ్‌ అలాంటిదిమరి..! ఈ తరహాలోనే విశాఖలోని జాలర్లకు అరుదైన చేప ముఖ్యంగా ఔషధగుణాలున్న ‘ఒడిమీను’ చేప చిక్కింది…! ఎక్కువ డిమాండ్‌ ఉన్న ఈ 4 అడుగుల పొడవున్న అరుదైన చేపను ఓ వ్యాపారి కేజీకి రూ.900 చొప్పున కొన్నాడు..!

అరుదైన నాలుగు అడుగుల ఒడిమీను చేప..!

విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే పూడిమడక చేపల వేటకు అనువైన ప్రాంతంగా ఉంటుంది. గ్రామీణ విశాఖకు చెందిన మత్స్యకారులు పలువురు వేటకు పూడిమడకకు వెళుతుంటారు. పూడిమడక మత్స్యకారులకు తాజాగా అరుదైన ఒడిమీను చేప దొరికింది. వారం క్రితం చేపల వేటకు వెళ్లిన జాలర్లు శుక్రవారం తీరానికి చేరుకున్నాక తాము వేటాడిన మత్స సంపదను వలలనుంచి బయట వేసి పరిశీలించారు. అందులో 4 అడుగుల అరుదైన ఒడిమీను చేప చిక్కింది. సాధారణంగా చేపలు లావుగా, బరువుగా ఉంటాయి. సాధారణ చేపలు గరిష్ఠంగా 2 నుంచి 3 అడుగులు ఉంటుంటాయి. కానీ ఈ నాలుగు అడుగుల చేపలు చాలా అరుదుగా ఉంటాయి..!

కేజీ కి రూ.900 చొప్పున…

మత్స్య కారులకు దొరికిన ఈ అరుదైన ఒడిమీను చేపను వ్యాపారి కొండయ్య కేజీ 900 రూపాయల లెక్కన చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ చేపను చూడడానికి మత్స్యకారులు సైతం ఉత్సాహం చూపించారు. నాలుగు అడుగుల పొడవైన ఒడిమీను చేప చిక్కడం అరుదని మత్స్యకారులు తెలిపారు.

ఔషధ గుణాలు ఎక్కువ-డిమాండూ ఎక్కువ..!

సాధారణంగా ఒడిమీను చేపలు మూడు అడుగులకు మించి చిక్కవట. అరుదుగా నాలుగు అడుగుల పొడవైన చేప చిక్కిందని చేపల వ్యాపారి తెలిపారు. ఈ చేపలలో ఔషద గుణాలు ఎక్కువ ఉంటాయని విపరీతమైన డిమాండ్‌ ఉంటుందట. కొన్ని రకాల ఔషధాల తయారీలో ఈ చేపను వాడతారట. ఇలానే కోనం, వజ్రం రకాల చేపలు కూడా దొరికినా ఈ విడత లో ఒడిమీనుకే అధిక ప్రాధాన్యత లభించిందట..!

➡️