ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేల ఎకరాల ఆక్రమణ

Feb 5,2024 00:00

విలేకర్లతో మాట్లాడుతున్న శ్రీనివాసరావు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
పిడుగురాళ్లలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న దేవాదాయ భూమిని వైసిపి నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వారి అక్రమాలకు హద్దు లేకుండా పోతోందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మండల పరిధిలోని కోనకిలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ జెడ్‌పిటిసి వీరభద్ర రామిరెడ్డి, విఆర్‌ఒ సత్యారెడ్డి, డాక్యుమెంట్‌ రైటర్‌ లింగారెడ్డి కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, భూమిని గుర్తించేది ఒకరు, అందుకు ధ్రువపతాలు ఏర్పాటు చేసేది ఒకరు, ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించేది ఒకరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎంచుకొని ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని అన్నారు. గురజాల నియోజకవర్గంలో మొత్తంగా 3 వేల ఎకరాలను కాజేసి బ్యాంకులలో తనకా పెట్టి రుణాలు కూడా తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న భూమిని విజయసాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న ఊటుకూరు శివగోవింద్‌రెడ్డి పేరు మీద మారుస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములపై విచారణ చేసి సంబంధిత అధికారులు, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలో 33 ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని అన్నారు. మహేష్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక హత్యలు, దాడులు పెరిగాయని విమర్శించారు. ఒకట్రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుంటే కాసు మహేష్‌రెడ్డి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి శంకుస్థాపన అంటూ టెంకాయలు కోడితే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రజల సహకా రంతో గురజాల నియోజకవర్గంలో ఏడో సారి తాను పోటీ చేయబోతున్నానని, జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబో తుందని అన్నారు. టిడిపి, జనసేన కలిసి గురజాలకు ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించబోతున్నామని తెలిపారు.

➡️