పస్తులతో ఉన్నాం.. ప్రజలైనా సహకరించండి..

Jan 10,2024 15:19 #Dharna, #muncipal workers
  • మున్సిపల్ కార్మికుల బిక్షాటన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి ఐ టి యు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సమ్మె బుధవారం నాటికి 16 వ రోజుకి చేరుకుంది.సమ్మెలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గంటస్తంభం వరకు భిక్షాటన చేసి ప్రభుత్వ వైఖరి పై తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జగన్మోహన్రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులను దేవుళ్ళుగా భావించారని, వారి కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన జల్లుకున్న పుణ్యమే అని, లక్ష రూపాయలు జీతం ఇచ్చిన మీ రుణం తీర్చుకోలేమనీ, అందర్నీ పర్మినెంట్ చేస్తామని వాగ్దానం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో సమాన పనికి సమానం ఇస్తామని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే ఆశతో మున్సిపల్ కార్మికుల ఎదురుచూసారని, ప్రభుత్వం స్పందించలేదు కాబట్టే సన్న చేయాల్సి వచ్చిందని తెలిపారు. నేటికీ 16 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం తూ తూ మంత్రంగా చర్చలు జరుపుతుందని, ప్రస్తుతం ఇస్తున్న జీతం, హెల్త్ అలవెన్స్ కలిపి జీతం గా ప్రకటించి ఇదే ఎక్కువ అన్నట్లు మంత్రులు గొప్పగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బేసిక్ వేతనం 21 వేలకు అదనంగా 3000 కలిపి 24000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా నాయకులు భాస్కర్ రావు, కుమారి లు మాట్లాడుతూ కరోనాలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడి 80 మంది పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, నిరంతర వ్యర్ధాల సేకరణ వల్ల అనారోగ్యాలతో తక్కువ వయసులోనే మరణిస్తున్నారని, ప్రస్తుత ధరల్లో ప్రభుత్వం ఇచ్చే జీతం ఇంటి నిర్వహణ వైద్య ఖర్చులకే సరిపోదని, మరో మూడు వేల అదనంగా ఇవ్వాలని అడిగితే డబ్బులు లేవని ప్రభుత్వం ఎదురుదాడికి దిగటా న్ని అవమానంగా భావిస్తున్నామని , పస్తులతో ఉన్నాం ప్రజలైన సహకరించాలని నినదిస్తూ బిక్షాటన ద్వారా మా యొక్క నిరసనను తెలియజేస్తున్నామని, సాయంత్రం సిఐటియు అనుబంధ సంఘంతో జరిగే చర్చల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆశిస్తున్నామని తెలిపారు. బిక్షాటనలో నాయకులు రజిని, పైడ్రాజు, వెంకట్రావు ,వంశీ, సూరి ,ఈశ్వరమ్మ, రమణ బాబురావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

➡️