యువకులు రక్తదానం చేయాలి

నివాళి అర్పిస్తున్న సూపరింటెండెంట్‌

ప్రజాశక్తి పాడేరు: ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని వ్యవస్థాపకులు జీన్‌ హెన్రీ డ్యూనాట్‌ జయంతిని పురస్కరించుకొని పాడేరు అల్లూరి జిల్లా బ్రాంచ్‌ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వామిత్ర మాట్లాడుతూ, హెన్రీ డ్యూనాంట్‌ స్ఫూర్తితో ప్రపంచ దేశాలలో అత్యవసర సేవలను అందిస్తున్న ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారికి అభినందనలు తెలిపారు. ప్రజలు, యువకులు సేవా దృక్పథంతో స్వచ్ఛందంగా రెడ్‌ క్రాస్‌ సంస్థలో చేరి సేవలందించాలని సూచించారు. ఉత్సాహవంతులైన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రాణాపాయంలో ఉన్న రోగులకు ప్రాణ దాతలుగా నిలవాలన్నారు. బ్రాంచ్‌ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా ఆరు యూనిట్లు రక్తాన్ని అందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రాజీవ్‌, రెడ్‌ క్రాస్‌ కో ఆర్డినేటర్‌ లోహితాస్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు పి.సూర్యారావు, వి.జయలక్ష్మి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️