మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం నాయకులు

ప్రజాశక్తి-గుత్తి

మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఉన్న అంబేద్కర్‌ భవన్‌లో స్థానిక అధ్యక్షుడు ఎన్‌. రామాంజనేయులు అధ్యక్షతన మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ విభాగం కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈనెల 11,12,13వ తేదీల్లో 72 గంటల రిలే దీక్షలను విజయవంతం చేయాలన్నారు. గుత్తి మున్సిపాలిటీలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారన్నారు. ఆనారోగ్యంతో మరణించిన నలుగురు కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలన్నారు. కార్మికుల విధుల సమయంలో వేధింపులు ఆపాలన్నారు. సకాలంలో పనిముట్లు ఇవ్వాలన్నారు.జాతీయ సెలవులు కూడా మున్సిపల్‌ కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. వారికి రావలసిన అంత్యక్రియల ఖర్చులు రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పారిశుధ్య కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం అధ్యక్షులు సూరి, కోశాధికారి బాలు, ఉపాధ్యక్షుడు మహేష్‌,సుంకన్న, ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సూరిపోగుల రాజా, మురళి, నరసింహ, సాదిక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️