సాగునీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం

సాగునీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం

రాస్తారోకో చేస్తున్న రైతులు, నాయకులు

ప్రజాశక్తి-ఉరవకొండ

గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు సాగునీరు విడుదల చేసి ఆదుకోకపోతే ఆత్మహ త్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిబిసికి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున రైతులు మంగళవా రం ఉరవకొండ సమీపంలోని అనంతపురం-బళ్లారి రహదారిపై ఉన్న హంద్రీనీవా కాలువ వద్ద ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు టిడిపి, సిపిఐ, జనసేన పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తోపాటు రైతులు మాట్లాడుతూ 15 రోజుల క్రితమే కాలువకు నీరు బంద్‌ చేయడంతో దాదాపు 26వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయన్నారు. హంద్రీనీవా కాలువ నుంచి నీటిని మళ్లించి పంటలను కాపాడాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. హంద్రీనీవా నుంచి చిత్తూరు జిల్లా పుంగునూరుకు తీసుకెళ్తున్న నీటిని ఈ ప్రాంతానికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కనీసం ఒక తడి నీరు ఇచ్చి పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పంటలు నష్టపోయి రైతులు దాదాపు రూ.300 కోట్టు నష్టపోతారన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే తమకు అప్పగిస్తే రైతులకు నీటిని అందిస్తామన్నారు. 2016లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే హంద్రీనీవా నుంచి జిబిసి కాలువకు నీటిని అందించి పంటలను కాపాడామని గుర్తు చేశారు. మరోవైపు పంటలకు నీరందక ఎండిపోతుంటే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నా రు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సాగునీరు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన వద్దకు చేరుకుని ఎమ్మెల్యే కేశవ్‌తోపాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో విడపనకల్‌ టిడిపి మండల కన్వీనర్‌ చిన్నమారయ్య, నాయకులు తిమ్మరాజు, చంద్రశేఖర్‌, రాజాస్వామి, తిప్పారెడ్డి, వీరసింహా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున, నాయకులు సుల్తాన్‌, సంజమ్మ, జనసేన జిల్లా కార్యదర్శి గౌతమ్‌కుమార్‌, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

➡️