భయపెడుతున్న సీజనల్‌ వ్యాధులు

గుత్తి గురుకుల పాఠశాలలో డయేరియా సోకిన విద్యార్థినికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారి

         అనంతపురం ప్రతినిధి : వర్షాకాలం మొదలవడంతో సీజనల్‌ జబ్బులు భయపెడుతున్నాయి. ఒకవైపు డయేరియా చాపకింద నీరులా విజృంబిస్తుండగా, జ్వరాలు కూడా అదే స్థాయిలో కలవర పెడుతున్నాయి. ఈ ఏడాది ఎప్పుడూలేనంతగా జూన్‌ నెలలో వర్షాలు పడ్డాయి. సాధారణం కంటే 170 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. గుంతలు, చిన్న కుంటల్లోకి నీరు చేరడడంతో దోమల బెడద సైతం పెరిగింది. దీంతో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అంటు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు వైద్యఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.

పామిడిలో ఇద్దరు మృతి ..

             డయేరియా (అతిసార) జిల్లాలో విజృంభిస్తోంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సోమవారం వరకు 16 మంది బాధితులుండగా రెండు రోజుల్లో ఈ సంఖ్య 60కిపైగా పెరిగింది. అదే విధంగా పామిడి మండలం రామగిరి ఎగువతాండలో ఇప్పటికే ఇద్దరు దీని బారినపడి మృత్యువాతపడ్డారు. వారం రోజుల క్రితం పెద్దమ్మ(60) అనే మహిళా మృతి చెందింది. మంగళవారం నాడు రేణుక (22) మృతి చెందారు. ఈ రకంగా క్రమక్రమంగా డయేరియా బాధితులు సంఖ్య పెరుగుతోంది. గుత్తిలోని గురుకులంలోనూ విద్యార్థులు డయేరియా బారిన పడ్డారు. నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఇటీవలే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది విస్తరించకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.

విస్తరిస్తున్న జ్వరాలు

        వర్షాలు పడి నీరు కుంటల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి చేరడంతో దోమల బెడద పెరిగింది. దీని వల్ల జ్వరాలు విస్తరిస్తున్నాయి. మలేరియాతోపాటు కామెర్లు సైతం వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో బాధితులు బారులుదీరుతున్నారు. జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. సీజనల్‌ వ్యాధులు విస్తరిస్తున్నా ఇవి ప్రభలకుండా తీసుకోవాల్సిన చర్యలు ఉండటం లేదన్న విమర్శలున్నాయి. దోమల నివారణకు ఎక్కడా ఫాగింగ్‌ జరుగుతున్న దాఖలాల్లేవు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మురుగునీరు నిలువున్న ప్రాంతాల్లో దోమల నివారణకు అవసరమైన పిచికారి కూడా లేదన్న విమర్శలున్నాయి.

➡️