కలిసికట్టుగా పని చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న అనంతపురం జిల్లా ఎన్నికల పరిశీలకులు రామమోహన్‌ మిశ్రా

       అనంతపురం కలెక్టరేట్‌ : సాధారణ ఎన్నికల్లో అధికారులు కలిసికట్టుగా పనిచేయడం ప్రత్యేక అవకాశంగా భావించి ఈ మేరకు విజయవంతం చేయాలని ఎన్నికల పరిశీలకులు రామ్‌మోహన్‌ మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు – 2024 సంసిద్ధతపై నోడల్‌ అధికారులు, ఇతర సిబ్బందితో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌ బర్దర్‌తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ పోలింగ్‌ను శాంతియుతంగా నిర్వహించాలన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజు అన్ని రకాల జాగ్రత్తలు, పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. పోలింగ్‌ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించేందుకు అన్ని రకాల గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను సజావుగా జరిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఒక పార్లమెంట్‌, 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 20,20,366 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల కోసం 2,236 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ర్యాంపు, డ్రింకింగ్‌ వాటర్‌, టాయిలెట్స్‌, షేడ్‌, లైటింగ్‌ లాంటి అన్ని రకాల కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. 576 వీల్‌ఛైర్స్‌ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఓటర్‌ గైడ్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్స్‌ పంపిణీ పెండింగ్‌ వెంటనే పూర్తి చేస్తామన్నారు. ఈవీఎం స్ట్రాంగ్‌ రూముల వద్ద నిబంధనల ప్రకారం భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ అమిత్‌ బర్దర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని రకాల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అంతరాష్ట్ర, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బందోబస్తు చేపడుతున్నామన్నారు. ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ కోసం అన్ని భద్రత, బందోబస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు, అధికారులు పాల్గొన్నారు.

➡️