ఉత్సాహంగా బృందాకరత్‌ సభలు

ఇండియా బ్లాక్‌, సిపిఎం 

పాడేరు ఏజెన్సీలో సిపిఎం జోష్‌

ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు

ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని వక్తలు పిలుపు

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి విలేకరులు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో బుధవారం సిపిఎం ఎన్నికల ప్రచార సభలు ఉత్సాహంగా సాగాయి. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ప్రసంగం ఆదివాసీలను ఆలోచింపజేసింది. గిరిజన ప్రాంతంలోని వనరులను కార్పొరేట్లకు అప్పగించేందుకే అటవీ సంరక్షణ చట్టాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం సవరించిందని బృందాకరత్‌ ఆయా సభల్లో పేర్కొన్నారు. బడా కార్పొరేట్ల లాభాల కోసం ఆదివాసీ హక్కులను దెబ్బతీస్తున్న బిజెపిని, దానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న టిడిపి, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కులను కాపాడే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. ఇండియా వేదిక తరపున బరిలో ఉన్న సిపిఎం అరకు ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి శతక బుల్లిబాబులకు మద్దతుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లిల్లో బుధవారం రోడ్‌షో, బహిరంగ సభలు జరిగాయి. వీటికి ముఖ్య అతిథిగా హాజరైన బృందాకరత్‌ తన ప్రసంగంతో, పాలకులకు సంధించిన ప్రశ్నలతో ఆకట్టుకున్నారు. ఆదివాసీ వ్యతిరేకులకు ఈ ఎన్నికల ద్వారా బుద్ధిచెప్పాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ గత పదేళ్లలో గిరిజనప్రాంత అభివృద్ధి కుంటుపడిందన్నారు. అడవులను, అటవీ చట్టాలను, హక్కులను రక్షించుకోవడానికి అప్పలనర్సను అరకు ఎంపీగా, బుల్లిబాబును పాడేరు ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ గిరిజనులు పోరాడి సాధించుకున్న అటవీ భూముల హక్కు పత్రాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ తన ఫొటో వేయించుకుని గిరిజనులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆదివాసీ పోరాటాల్లో అండగా నిలిచి, చట్టసభల్లో ప్రజాగళాన్ని వినిపించే సత్తా ఉన్నా నాయకులను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. సిపిఎం అరకు ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స మాట్లాడుతూ గిరిజన ప్రాంతం పట్ల నిర్లక్ష్యం వహించిన పాలక పక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల ఓట్లు వేయించుకుని మైనింగ్‌ ఏజెంట్లుగా మారిపోయి, గిరిజనులకు ఆధారమైన అడవులను కట్టబెట్టేందుకు పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను తరిమితరిమి కొట్టాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ ఏజెన్సీలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల కోసం అటవీ భూములను అదానీకి అప్పగించేందుకు సిద్ధమైన పాలక పార్టీలను ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఆయా సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు, కాంగ్రెస్‌ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి శతక బుల్లిబాబు, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీల నాయకులు కంకిపాటి వీరన్నపడాల్‌, వంతల కృష్ణారావు, కుర్ర సూరిబాబు, కూడా సింహాచలం, ఎస్‌.గంగరాజు, సిపిఎం నాయకులు పాంగి ధనుంజరు, సాగిన చిరంజీవి, గాలికొండ ఎంపిటిసి అంపురంగి బుజ్జిబాబు, శాంతి, సూరిబాబు, సిపిఐ నాయకులు పోతురాజు, ఎర్రబొమ్మల ఎంపిటిసి సభ్యుడు సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీలు, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు పాడేరులో నిర్వహించిన రోడ్‌షోలో బృందాకరత్‌, లోకనాథం, సిహెచ్‌.నర్సింగరావు తదితరులు పాల్గొనగా వారికి ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. గిరిజన మహిళలు థింసా నృత్యంతో ఆకట్టుకున్నారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు రోడ్డు షో సాగింది. దారి పొడుగునా బృందాకరత్‌ ప్రజలకు అభివాదం చేస్తూ ఇండియా కూటమి బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌లో సభ జరిగింది. చింతపల్లిలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి సంత బయలు మీదుగా పాత బస్టాండు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు

 

➡️