ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

May 8,2024 20:59

ప్రజాశక్తి-బొబ్బిలి: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని బొబ్బిలి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎ.సాయిశ్రీ అన్నారు. బుధవారం ఆర్‌డిఒ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎవరికి నిర్దేశించిన విధులను వారు సమయానుసారం హాజరై బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పారు. అలసత్వం, పనిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసు కుంటామని తెలిపారు. సిబ్బందికి ఎలాంటి మినహా యింపులు ఉండవని, తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి 12న వచ్చే పోలింగ్‌ సిబ్బందికి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్రంలో సెక్టార్‌ వారిగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల అనంతరం పోలింగ్‌ సామగ్రి అప్పగించడానికి విజయనగరం జెఎన్‌టియు-జివిలో రిసెప్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎఎల్‌ఎంటి జెసి రాజు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఎఆర్‌ఒలు త్రినాథరావు నాయుడు, రాజ్యలక్ష్మి, రాజారావు, సులోచనరాణి, మున్సిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మి, ఎలక్షన్‌ డిటి సాయికృష్ణ, డిటి చిన్నారావు, ఎఎస్‌ఒ సురేష్‌ కుమార్‌, సెక్టోరియల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి: జిల్లా ఎస్‌పి భోగాపురం: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్‌పి దీపిక పాటిల్‌ మత్స్యకారులకు సూచించారు. మండలంలోని తీర ప్రాంత గ్రామమైన ముక్కాం గ్రామంలో బుధవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో వివాదాలకు వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎవరు ఉండరాదన్నారు. ఎవరైనా వివాదాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. అందుకు పూర్తి భద్రత పోలీసుల నుంచి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి ఆర్‌ గోవిందరావు, సిఐ ఎ.రవికుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.సజావుగా ఎన్నికల నిర్వహణకు చర్యలు: డిఎస్‌పి మహేంద్రరేగిడి: రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిఎస్‌పి మహేంద్ర కోరారు. బుధవారం రాజాం తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఒ జోసెఫ్‌ ఆధ్వర్యంలో పార్టీ అభ్య ర్థులు, ఏజెంట్లతో ఎన్నికల నియమావళి, అనుసరిం చాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 286 కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. పోలింగ్‌ స్టేషన్‌ వద్ద 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటాయని తెలిపారు. ఓటర్లను ఆటోలు, రవాణా వాహనాల ద్వారా తరలించడం వంటివి చేయరాదన్నారు. పోలింగ్‌ స్టేషన్లో ప్రచారం చేయడం, ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ పంచడం, సింబల్స్‌ని చూపించడం వంటివి చేయరాదని సూచించారు. సమావేశంలో రాజాం తహశీల్దార్‌ ఎస్‌.కృష్ణం రాజు, ఎలక్షన్‌ డిటి ప్రకాశ్‌, రాజాం టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.మోహన్‌రావు, రూరల్‌ సిఐ ఎస్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️