విశ్వ మానవతకు ప్రతీక డొక్కా సీతమ్మ : ఎపి డబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి మండెల శ్రీరామూర్తి

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ 115 వ వర్ధంతిని ఆదివారం బమ్మూరు కొత్తపేటలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి మండెల శ్రీరామూర్తి మాట్లాడుతూ … విశ్వ మానవతకు అద్దం పట్టిన మహిళామణి డొక్కా సీతమ్మని, ఆంధ్రప్రదేశ్‌ కీర్తిని ఇంగ్లాండ్‌ వరకు వ్యాపింపజేసి, అమ్మ ప్రేమను అన్నార్థులకు పంచి, జీవితాన్ని చరితార్ధం చేసుకున్న కీర్తి పతాక డొక్కా సీతమ్మని ఆమె సేవల్ని కొనియాడారు. మరో అతిథి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ లోకం వీడి వందేళ్లు దాటినా పేరు ఆశించకుండా ఆమె చేసిన సేవలు గోదావరి జిల్లాల్లో నేటికీ కథలై వినిపించడం విశేషం అన్నారు. ఆంథ్రా అన్నపూర్ణగా కొలిచే ఆమె నేటి సమాజానికి ఆదర్శమూర్తి అనిపేర్కొన్నారు. కార్యక్రమంలో ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి కళాశాల సమితి అడపా సుబ్రహ్మణ్యం, ఫిలాంత్రోపిక్‌ సొసైటీ అధ్యక్షుడు అద్దంకి రాజా యోనా తదితరులు పాల్గొన్నారు.

➡️