ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి : డిఎస్పీ

May 8,2024 15:57 #2024 election, #Kadapa, #police

ప్రజాశక్తి-చాపాడు (కడప) : మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని మైదుకూరు డిఎస్పీ వెంకటేశులు సూచించారు. బుధవారం స్థానిక వైఎస్‌ కళ్యాణమండపంలో ఎస్‌ఐ కొండారెడ్డి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ … ప్రచారాలు ముగిసే వరకు ఎన్నికల రోజున అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలన్నారు. ఘర్షణలకు, గొడవలకు పాల్పడవద్దన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్లుగా విద్యావంతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఘర్షణలను ఎవరు ప్రోత్సహించిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రూరల్‌ సిఐ శ్రీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ … నాయకులు ముఖ్యంగా యువతను అదుపులో ఉంచుకోవాలన్నారు. ఓటర్లను భయపెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు అభ్యర్థించాలన్నారు. పోలీసు సిబ్బందికి అన్ని విధాల సహకరించాలన్నారు. ఎన్నికల రోజున పోలింగ్‌ కేంద్రంలో తుది నిర్ణయం పోలింగ్‌ ఆఫీసర్‌ దే అని వారి ఆదేశానుసారం నడుచుకోవాలన్నారు. మీకు న్యాయం జరగలేదనిపిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. కొత్త వ్యక్తులను గ్రామాలలోనికి రానివ్వకూడదన్నారు. అనంతరం నాయకులు అడిగిన ప్రశ్నలకు డిఎస్పి సిఐలు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది,వైసిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు.

➡️