పిడుగుపాటుతో నలుగురు దుర్మరణం

May 8,2024 00:56

నాగేంద్రం, నాగరాణి మృతదేహాలు
ప్రజాశక్తి – క్రోసూరు, ముప్పాళ్ల :
పల్నాడు జిల్లాలో మంగళవారం పిడుగుపడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు తల్లీకూతుళ్లు కాగా, ఇద్దరు గొర్రెల కాపరులున్నారు. క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన బొందల నాగేంద్రం (52), ఆమె కుమార్తె యండ్రపల్లి నాగరాణి (25) పొలం పనులకు వెళ్లారు. మొక్కజొన్న కండెలను వేరుచేసే పనిలో ఉండగా వర్షం రావండంతో ఇంటికి పయనమయ్యారు. అదేసమయంలో వారిపై పిడుగుపడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ముప్పాళ్ల మండలం కుందురువారిపాలేనికి చెందిన ఆవుల కోటేశ్వరరావు (45), అతని మేనల్లుడైన బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన జమ్ముల గోపి (35), మరికొంతమంది గొర్రెల కాపరులు కలిసి నరసరావుపేట మండలం ములకలూరు అగ్రహారం పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. సాయంత్రంవేళ ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో కోటేశ్వరరావు, గోపి తమ గొర్రెలను తోలుకుని సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. కొద్దిసేపటికి చెట్టుపై పిడుగు పడడంతో ఆ ప్రభావానికి కోటేశ్వరరావు, గోపి అక్కడికక్కడే మృతి చెందారు. కోటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు కాగా, గోపీకీ భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గోపీ తన జీవాలను మేపుకోవడానికి రెండ్రోజుల కిందటే వచ్చాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో 50 గొర్రెలూ మృతి చెందాయి.

నరసరావుపేటలో కుండపోత
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం, మండలం, రొంపిచర్ల మండలాలలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. వినుకొండ, పల్నాడు, సత్తెనపల్లి, రొంపిచర్ల మార్గాలలో ఈదురు గాలుల తీవ్రతకు ఎండిపోయిన చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహన రాజపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచింది. ప్రస్తుతం పొలాలలో కూరగాయలు, నువ్వులు సాగు చేశారు. ఆపంటలకు నష్టం వాటిళ్లకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 20 నిముషాల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడి జనం ఉపశమనం పొందారు. మరోవైపు పశు గ్రాసం లేక ఇబ్బంది పడుతున్న పశువులకూ ఈ వర్షం వల్ల గ్రాసం కొరత తీరుతుందని పాడిరైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుల ధాటికి పొలాల్లోని పాడి రైతులు భయాందోళనకు గురయ్యారు. బావుల కింద వేసిన మొక్కజొన్న పొలంలో ఉండడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు టార్ఫాలిన్‌ పట్టలు పట్టుకుని ఉరుకులు పరుగులు పెట్టారు. చాగంటివారిపాలెం శివారు జంగుంట వద్ద భారీచెట్లు రోడ్డు మీద పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ హజరతయ్య స్పందించి దాన్ని తొలగింపజేశారు. ముప్పాళ్లలో డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్డు మీదకి ప్రవహించింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ప్రజాశక్తి – పెదకూరపాడు : పెదకూరపాడులో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తొలుత ఈదురుగాలులు ప్రారంభం కాగానే విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు.

ప్రజాశక్తి-మాచర్ల రూరల్‌ : మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో ఒక్క సారిగ వాతావారణం చల్లబడింది. స్థానికులు ఆరుబయటకు వచ్చి సేదదీరారు. ప్రతిరోజూ 42-46 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదవుతున్న పరిస్థితుల్లో రెండ్రోజులుగా సన్నటి జల్లులు పడటంతో వాతావరణంలో వేడి తగ్గి జనం ఉపశమనం పొందారు.
వర్షంతో ఉపశమనం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. మధ్యా హ్నం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం నుంచి వర్షం ప్రారం భం కావడంతో వాతావరణం చల్లబడింది. రాత్రికి చల్లటి గాలులు వీచాయి. పలు మండలాల్లో ఆకాశం మేఘావృత్తమై కొన్ని ప్రాంతాల్లో రాత్రిపొద్దు పోయే వరకు చిరుజల్లులు కొనసాగాయి. పలు మండ లాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. గుంటూరు నగరంలో భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు పారింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వారం రోజులుగా వడగాల్పులు, ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు చల్లటి వాతావరణం ఉపశమనం కలిగించింది. పల్నాడులో ప్రతిరోజూ 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదవుతున్న నేపథ్యంలో మాచర్ల, గుర జాల, సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవడం ప్రజలు ఊపిరి సేదదీరారు. వర్షంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

➡️