సర్కారు వైద్యం సగమేనా?

Apr 28,2024 21:28

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : వైసిపి ఐదేళ్ల పాలనలో సర్కారు వైద్యం ఏజెన్సీ ప్రాంతంలో అంతంత మాత్రంగానే అందుతుంది. ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు లేకపోవడంతో ఇటు విద్యార్థులు అటు గిరిజనులు నిత్యం వ్యాధులతో బాధపడుతూ మృత్యువాత పడుతున్నారు. ఏడాది పొడవునా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పిట్టల్లారాలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మెరుగైన సేవలందించే దిశగా ఆలోచన చేయకపోవడం శోచనీయం. గుమ్మలక్ష్మీపురం మండలంలో 12 ఆశ్రమ పాఠశాలలు, 2 గురుకుల పాఠశాలలు, రెండు పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి చదువు కోసం వేలాదిమంది విద్యార్థులు వచ్చి ఉంటున్నారు. వీరికి అనారోగ్యం వాటిల్లితే స్థానికంగా వైద్య సేవలు కరువే. గత టిడిపి ప్రభుత్వంలో నియమించిన ఆరోగ్య కార్యకర్తలను వైసిపి అధికారంలోకి వచ్చాక తొలగించింది. దీంతో విద్యార్థులు వైద్యం కోసం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. అయితే ఆ ఆసుపత్రుల్లో కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉన్నా సరైన సౌకర్యాలు లేవు. ఇది సామాజిక ఆరోగ్య కేంద్రంగా రూపాంతరం చెందిన పది పడకల ఆసుపత్రి సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రూ.8.95 కోట్లతో వంద పడకల ఆసుపత్రి మంజూరై జరుగుతున్న నిర్మాణ పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. తాడికొండ, రేగిడి, దుడ్డు ఖల్లు ప్రాథమిక కేంద్రాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాదిమంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. అయితే వీరికి ప్రథమ చికిత్సతోనే సరిపెడుతున్నారు. గర్భిణులు, చిన్నారులను అత్యవసర సమయాల్లో గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆస్పత్రిలో స్కానింగ్‌, ఎక్స్‌రే వంటి పరికరాలు కూడా లేవు. ఈ ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గాయపడిన వారికి సకాలంలో వైద్యమందక ప్రాణాలు కోల్పోతున్నారు.మెరుగైన వైద్యం కరువే ఏజెన్సీలో గిరి పుత్రులకు మెరుగైన వైద్యం కరువే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా సౌకర్యాలు లేని పరిస్థితి. దీంతో గిరిజనులు ఉన్నత వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి.మండంగి శ్రీనివాసరావు గిరిజన సంఘం జిల్లా నాయకులు.

➡️