మత్స్యకారులకు న్యాయం జరగాలి

Mar 5,2024 14:56 #Dharna, #fishermen, #Kakinada
  • లేదంటే సిస్మిక్‌ సర్వే అడ్డుకుంటాం
  • కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టీకరణ

ప్రజాశక్తి-కాకినాడ : ఓయన్‌జిసి, రిలయన్స్‌ ఆధ్వర్యంలో సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు సముద్రంలో జరిగే సిస్మిక్‌ సర్వే సందర్భంలో చేపల వేట వృత్తిగా జీవించే మత్స్యకారులకు జీవనోపాధి కల్పించకపోతే ఆ సర్వేను అడ్డుకుంటామని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కాకినాడ ఎంపీ గీతా విశ్వనాధ్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలసి సిస్మిక్‌ సర్వె కాలంలో మత్స్యకారులకు జరిగే నష్టంపై కలెక్టర్‌ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. సముద్రం ఒడ్డు నుండి సుమారు ఐదు వందల కిలోమీటర్లు వరకు సముద్రంలో ఈ సర్వే ఉంటుందని, ఆ ప్రాంతంలో అన్ని నెలల పాటు మత్స్యకారుల చేపల వేటపై నిషేధం విధిస్తూ, జీవో విడుదల చేశారని చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో సుమారు 45 వేల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. ఆ సర్వే సమయంలో జీవనోపాధి కోల్పోయిన ప్రతి ఒక కుటుంబానికి ఓయన్జీసి, రిలయన్స్‌ అండగా నిలబడి ఆర్ధికంగా వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేసారు. ఈ విషయంలో వారు స్పందించకపోతే, ఎటువంటి పరిస్థితుల్లో సిస్మిక్‌ సర్వే జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

➡️