హోరెత్తుతున్న సెల్‌ ఫోన్‌ ప్రచారాలు

Apr 28,2024 22:42
గతంలో ఎన్నికల్లో నిలబడిన పార్టీ అభ్యర్థులు

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

గతంలో ఎన్నికల్లో నిలబడిన పార్టీ అభ్యర్థులు ఓటర్లును ఆకట్టుకునేందుకు నేరుగా కలవడం లేదా మైకులు ద్వారా ప్రచారం చేసేవారు. ఈ ప్రచారం కొత్త పుంతలు తొక్కినట్లు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో వీటినే అభ్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా, రాత్రి అపరాత్రి అన్నా తేడా లేకుండా ఫోన్లు రింగ్‌ అవుతున్నాయి. ఫోన్‌ రింగ్‌ కాగానే ఎవరూ ఏ పనుల్లో ఉన్నా ఫోన్‌ను లిఫ్ట్‌ చేయడం జరుగుతోంది. తీరా అవతల నుంచి వినిపించే వ్యాఖ్యలు తమ అభ్యర్థికి ఓట్లు వేయాలి అంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. సమయపాలన లేకుండా ఫోన్లు రింగ్‌ అవడంతో ప్రజలు ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు, విరామ సమయంలో, రాత్రి సమయం అని తేడా లేకుండా ప్రధాన పార్టీలకు చెందిన సోషల్‌ మీడియా సంస్థలు అదేపనిగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో అయితే సెల్‌ఫోన్‌కు రింగ్‌ రాగానే లిఫ్ట్‌ చేయడం వెంటనే ‘నిజాయితీని గెలిపించుకుందాం’ ‘ఉమ్మడి అభ్యర్థికి ఓటేద్దాం.. గ్లాస్‌ గుర్తుకే ఓటేద్దాం’ అంటూ జనసేన పార్టీ సోషల్‌ మీడియా, ‘నా తల్లి, మా అక్క గీతమ్మకు ఓటెయ్యాలి..లోకల్‌ కావాలో యాక్టర్‌ కావాలో మీరే నిర్ణయిం చుకోండి.. జ్వరం వస్తే హైదరాబాద్‌ వెళ్లే వ్యక్తి కావాలా’ అంటూ ఫ్యాను గుర్తుకు ఓటేసి మద్దతు ఇవ్వండి అని వైసిపి సోషల్‌ మీడియా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అత్యవసర పనుల కోసం వెళ్తున్న వాహన దారులు ఫోన్‌ రింగై తీస్తే ఇవే మాటలు రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మధ్యాహ్న సమయం రాత్రి సమయం అని తేడా లేకుండా జనసేన, వైసిపి నుంచే ఇలాంటి ఫోన్లు వస్తున్నా యని తెలుపుతున్నారు. ప్రచార సమయానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమయం ఉంది. కానీ సెల్‌ ఫోన్‌ ప్రచారానికి మాత్రం సమయం ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ సభలకు, ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా కావాలి కానీ సెల్‌ ఫోన్‌ ప్రచారాలకు మాత్రం అనుమతుల అక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు. రికార్డింగ్‌ వాయిస్‌లతో ఇష్టం వచ్చిన సమయాలలో సెల్‌ ఫోన్‌లకు పంపిస్తున్నారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌పై ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️