మా సహనానికి హద్దులుంటాయి: కన్నబాబు

Apr 28,2024 22:49
మా సహనానికి

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

మా సహనానికి హద్దులుంటాయని గుర్తుంచుకుంటే మంచిదని మాజీ మంత్రి, వైసిపి కాకినాడ రూరల్‌ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు హెచ్చరించారు. ఆదివారం స్ధానిక వైసిపి కార్యాలయంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఇంద్రపాలెంలో నిర్వహించిన జనసేన సభలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. చంద్రబాబుకు దత్తపుత్రుడుగా రాజకీయాలు చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌కు సంస్కారం లేదన్నారు. పవన్‌ మాదిరిగా అవమానకరమైన రీతిలో మాట్లాడటం ఒక ఎంఎల్‌ఎగా, రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదనే సహనంగా ఉంటున్నామని, మా సహనానికి కూడా ఓహద్దు ఉంటుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చిరంజీవి అంటే తనకు వల్లమాలిన అభిమానమని, కానీ పవన్‌ కళ్యాణ్‌ మాటలు చాలా బాధాకరంగా అసహ్యంగా ఉన్నాయని అన్నారు. 2008 చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నా జీతం రూ.లక్ష అని నేను గౌరవప్రదమైన జర్నలిస్ట్‌ వృత్తిలో ఉన్నానని స్పష్టం చేశారు. 2018లో చంద్రబాబుని, బిజేపిని తిట్టిన విషయం గుర్తు చేశారు. నువ్వు చిరంజీవికి తమ్ముడు కాకుండా ఉంటే నువ్వు టీ టైంలో పని చేసుకునేవాడివని దుయ్యబట్టారు. నీకు నీ అన్న చిరంజీవి సినిమా బిక్ష పెడితే కనీసం మీ అన్న పేరు తలవని మూర్ఖుడివని అన్నారు. చిరంజీవి అండదం డలతో నేను రాజకీయాలలోకి రావడం నిజమని, ఆయన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తానని అన్నారు. చంద్రబాబుకు తొత్తుగ మారిన నీ రాజకీయ జీవితం, భవిష్యత్‌ అంధకారమేనని ఆయన జోస్యం చెప్పారు. వైసిపి విడుదల చేసిన మేనిఫెస్టోలో నిజాయితీ, నిబద్ధత ఉందని లారీ, టిప్పర్‌ డైవర్లకు అండగా ఉంటామని తమ మేనిఫెస్టోలో పెట్టడం సంతోషకరమని అన్నారు. తాత్కాలిక ఉద్యోగులకు అండగా ఉండటం, యువత నైపుణ్య శిక్షణ, విద్య, వైద్యానికి పెద్ద పీట, రైతులకు అండగా మరిన్ని పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. మరోసారి రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.

➡️