పీఏబీఆర్‌ డ్యామ్‌ వద్ద మున్సిపల్‌ కార్మికుల నిరసన

 ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : నగర ప్రజలకు తాగునీటిని అందించే పీఏబీఆర్‌ తాగునీటి స్కీం లో భాగమైన డ్యామ్‌ వద్ద గురువారం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం ఇంజనీరింగ్‌ నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున సంజీవ రాయుడు ఓబుల పతి మురళీమోహన్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌ , అన్‌ స్కిల్‌ వేతనాలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులను పర్మినెంట్‌ చేయాలని పది రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నామన్నారు. అయితే రెండు దఫాలుగా జరిగిన చర్చలలో నిధుల కొరత సాంకేతిక కారణాలు చూపి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం దారుణం అన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్‌ పై గడిచిన మూడేళ్లుగా వివిధ రూపాలలో పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టడం జరిగిందన్నారు. అయితే కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల న్యాయమైన డిమాండ్‌ పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన సాధించేందుకు చేపట్టిన నిరవధిక సమ్మెకు ప్రజల నుంచి స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఆమోదించి అటు ప్రజలకు ఇటు కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు కాంతమ్మ సర్దానమ్మ సుజాత ఇంజనీరింగ్‌ అండ్‌ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

➡️