కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Jan 7,2024 13:05 #Dharna, #Konaseema, #muncipal workers
  • 13వ రోజుకు పారిశుధ్య కార్మికుల సమ్మె

ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య సంఘ నాయకులు బంగారు కొండ, కొమరపు నరేంద్ర కుమార్‌ అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్‌ ఈ ఎస్‌ ఐ, పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదష్టకరమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లోవరాజు, సవరపు సరోజినీ, బంగారు అన్నవరం, మల్లవరపు సువార్త, మడికి హేమలత, సిహెచ్‌ వెంకటలక్ష్మి, భాను, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️