బస్సుల తరలింపుతో అవస్థలు

Apr 23,2024 21:04

ప్రజాశక్తి – విజయనగరం కోట, వేపాడ, రేగిడి : జిల్లాలోని విజయనగరం మండలం చెల్లూరు కేంద్రంగా మంగళవారం సిఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధం సభ నిర్వహించడంతో ఆర్‌టిసి బస్సులను అక్కడికి పెద్ద ఎత్తున తరలించేశారు. దీంతో సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, పెళ్లిళ్లకు వెళ్లాల్సిన బందువులు, ఆస్పత్రికి వెళ్లాల్సిన రోగులు నానా తంటాలు పడ్డారు. డిపోల్లో బస్సులు కోసం గంటల కొద్దీ నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో కాలినడక వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా విద్యాసంస్థలకు సెలవులు కావడంతో చాలా మంది పిల్లలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్‌టిసి కాంప్లెక్స్‌లకు వెళ్లినా బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. కొంత మంది ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇంతటి ఎండలో సకాలంలో బస్సులు లేక ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అరగంటకో గంటకో ఒక బస్సు రావడంతో ఒకేసారి ప్రయా ణికులు బస్సు ఎక్కేందుకు ఎగబడి ఇబ్బందులు పడ్డారు.విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల నుంచి పాలకొండ, రాజాం రావాల్సి బస్సులు సకాలంలో రాకపోవడంతో రాజాం బస్సుడిపో వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నుంచి బడులకు వేసవి సెలవులు ఇవ్వడంతో గురుకుల పాఠశాల విద్యార్థులు, కస్తూర్బా గాంధీ విద్యార్థులు, హాస్టల్‌ విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున డిపోలకు చేరుకున్నా అక్కడ బస్సులు లేకపోవడంతో తంటాలు పడ్డారు. విజయనగరం జోన్‌ పరిధిలోని 1080 బస్సులను సిఎం సభకు తరలించారు. విజయనగరం డిపో నుంచి విశాఖపట్నం, గాజువాక, మద్దిలపాలెం, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు వెళ్లకపోవడంతో విజయనగరం డిపోకు వచ్చిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చాలా మంది బస్సులు కోసం నిరీక్షించి రాకపోవడంతో ప్రయాణాలను రద్దు చేసుకుని వెనుదిరిగారు.వేపాడ మండలంలో బక్కునాయుడుపేట ఎపి ఆదర్శ పాఠశాల, కెజిబివి వసతి గృహం, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో చదువుతున్న సుమారు 2వేల మంది విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులిచ్చిన విషయం తెలిసిందే. అయితే సిఎం సభ కారణంగా శృంగవరపుకోట డిపోలో ఉన్న సుమారు అన్ని బస్సులనూ సిఎం సభకు తరలించడంతో గ్రామాల్లోకి రావాల్సిన బస్సులు రాలేదు. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు ఆర్‌టిసిలు కోసం ఎదురు చూసి ఇబ్బందులు పడ్డారు. చాలా మంది విద్యార్థులు చేత బ్యాగు పట్టుకుని మండుటెండల్లో నడిచి వెళ్లాల్సి పరిస్థితి దాపురించింది.

➡️