పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌ వద్ద పోలీసుల అత్యుత్సాహం

May 8,2024 22:22

 తహశీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న సిఐ

                        పుట్టపర్తి క్రైమ్‌ : పుట్టపర్తి పట్టణ కేంద్రంలోని చిన్న పల్లి ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అక్కడ బుధవారం ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు పోలింగ్‌ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో మండల మెజిస్ట్రేట్‌ వేణుగోపాల్‌ అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన సీఐ రాగిరి రామయ్య మండల మెజిస్ట్రేట్‌ పై తహశీల్దార్‌ అని కూడా చూడకుండా విరుచుకు పడడం తీవ్ర వివాదానికి దారి తీసింది. రిటర్నింగ్‌ అధికారి పోలింగ్‌ సిబ్బంది పట్ల మర్యాదగా వ్యవహరించాల్సిన సిఐ వారిపైనే దాడికి దిగడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉద్యోగులు ఎక్కువ స్థాయిలో పాల్గొనడం సహించలేక పోలింగ్‌ సిబ్బందిని ఓటర్లను పోలీసులే భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. దీంతో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి పోస్టింగ్‌ ఇప్పించాడని స్వామి భక్తి చాటుకునే దిశలో సిఐ రాగిరి రామయ్య వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్‌ ఎక్కువ అవుతున్న తరుణంలోనే సహనం కోల్పోయి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. పోలింగ్‌ సిబ్బంది ఆదేశాల మేరకు వ్యవహరించాల్సిన సిఐ పిఒ పట్ల దురుసుగా వ్యవహరించాడని ఆరోపించారు. మొదటి నుంచి పోలీస్‌ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోందని సిఐతో పాటు మరో ఇద్దరు అధికారులు సైతం ఇలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వైసిపి నాయకులను మాత్రమే పోలింగ్‌ బూత్‌ కేంద్రాలు లోకి అనుమతించి, టిడిపి వారిని అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.

➡️