నామినేషన్ల పరిశీలన పూర్తి

అనంతపురం కలెక్టరేట్‌లో నామినేషన్లను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌కుమార్‌

         అనంతపురం ప్రతినిధి : ఎన్నికల ప్రక్రియ మలి ఘట్టం పూర్తయ్యింది. నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయ్యింది. ఇక ఉపసంహరణ ప్రక్రియ మాత్రమే మిగులుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజవకర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 174 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసియున్నారు. ఇందులో 136 మందికి సంబంధించిన నామినేషన్లు ఆమోదం పొందాయి. 38 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు గురైన వాటిల్లో అత్యధికంగా స్వతంత్రులతోపాటు, డమ్మీగా ప్రధాన పార్టీల తరుపున వేసినవి ఉన్నాయి. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరి నామినేషన్లు ఆమోదం పొందాయి.

అనంతపురం జిల్లాలో..

రాయదుర్గం అసెంబ్లి నియోజకవర్గానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 14 ఆమోదం పొందాయి. మూడు తిరష్కరణకు గురయ్యాయి. ఉరవకొండలో 16 మంది నామినేషన్లు దాఖలు చేయగా 11 ఆమోదం పొందాయి. ఐదు తిరస్కరణకు గురయ్యాయి. గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 17 మందివి ఆమోదం పొందాయి. మూడు తిరస్కరణకు గురయ్యాయి. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 28 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 26 ఆమోదం పొందాయి. రెండు తిరస్కరణకు గురయ్యాయి. శింగనమల నియోజకవర్గంలో 22 మంది నామినేషన్లు వేయగా 16 ఆమోదం లభించాయి. ఆరు తిరస్కరణకు గురయ్యాయి. అనంతపురం అర్బన్‌లో 28 నామినేషన్లకుగానూ 21 ఆమోదం పొందాయి. ఏడు తిరస్కరణకు గురయ్యాయి. కళ్యాణదుర్గంలో 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేస్తే 16 వాటికి ఆమోదం లభించాయి. ఒకటి తిరస్కరణకు గురైంది. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి 26 మంది నామినేషన్లు వేస్తే 15 వాటికి మాత్రమే ఆమోదం లభించగా 11 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తంగా చూసినప్పుడు అనంతపురం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 136 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. 38 తిరస్కరణకు గురయ్యాయి. అనంతపురం పార్లమెంటుకు సంబంధించి మొత్తం 25 మంది నామినేషన్లు వేశారు. అందులో 21 మందికి సంబంధించిన నామినేషన్లు ఆమోదం పొందాయి. నాలుగు మాత్రం తిరస్కరణకు గురయ్యాయి.

సత్యసాయి జిల్లాలో

          సత్యసాయి జిల్లాలో నామినేషన్ల పరిశీలన సజావుగా జరిగింది. ఈ జిల్లా పరిధిలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్నింటిలోనూ కలిపి మొత్తం 188 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 51 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి 35 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 19 ఆమోదం లభించగా 16 తిరస్కరణకు గురయ్యాయి. కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 28 నామినేషన్లు దాఖలవగా 20 ఆమోదం పొందాయి. ఎనిమిది తిరస్కరణకు గురయ్యాయి. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి 39 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 25 ఆమోదం పొందాయి. 14 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి 35 నామినేషన్లు పడగా 28 ఆమోదం పొందాయి. ఏడు తిరస్కరణకు గురయ్యాయి. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి 26 నామినేషన్లు దాఖలవగా 23 ఆమోదం పొంది మూడు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 25 నామినేషన్లు దాఖలయితే 22 ఆమొదం లభించాయి. మూడు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తంగా చూసినప్పుడు 188 నామినేషన్లు ఆరు నియోజకవర్గాలకు పడ్డాయి. ఇందులో 137 ఆమోదం పొందాయి. ఇందులో ప్రధానమైన పార్టీల నుంచి తిరస్కరణకు గురైన వారు లేరు. అత్యధికంగా స్వతంత్రులు, డమ్మీలుగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసినవే అధికంగానున్నాయి.

➡️