ఇచ్చిన హామీలన్నీ అమలు

గత ఎన్నికల మేనిఫెస్టోలో

మాట్లాడుతున్న పేరాడ తిలక్‌

  • చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మడం లేదు
  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేశారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ అన్నారు. ప్రతి ఎన్నికల ముందు మేనిఫెస్టోను విడుదల చేసి హామీలను అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేసేవాడని, అందుకు భిన్నంగా జగన్మోహన్‌ రెడ్డి శతశాతం నెరవేర్చారని చెప్పారు. నగరంలోని శ్రీశయన కళ్యాణ మండపంలో ఆ సామాజిక తరగతి ముఖ్య నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు నుంచి వరద నీటిని వినియోగించుకునేందుకు కృషి చేశారని చెప్పారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి కీ.శే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పెద్దఎత్తున నిధులు ఇచ్చారని, ఆయన వారసుడు జగన్మోహన్‌ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టుకు నది నుంచి నీటిని తీసుకొచ్చేందుకు నిధులు విడుదల చేశారని చెప్పారు. రూ.700 కోట్లతో వంశధార నీటిని ఉద్దాన ప్రాంతానికి అందించారని కొనియాడారు. మూలపేట పోర్టుతో జిల్లా రూపురేఖలే మారబోతున్నాయన్నారు. మేనిఫెస్టోను మత గ్రంథాలుగా భావించి వాటిని అమలు చేసిన జగన్‌కు, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు పోలికే లేదన్నారు. చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా అధికారంలోకొచ్చాక అమలు చేయరన్న విషయం 2014 ఎన్నికల్లోనే రుజువైందన్నారు. దీంతో ఆయన ఇచ్చే హామీలనే ప్రజలు నమ్మడం లేదన్నారు. సమావేశంలో శ్రీశయన, తూర్పుకాపు కార్పొరేషన్ల చైర్మన్లు డి.పి దేవ్‌, మామిడి శ్రీకాంత్‌, వైసిపి నాయకులు ఎం.వి స్వరూప్‌, శ్రీశయన నాయకులు పాల్గొన్నారు.

➡️