ఈదురుగాలుల బీభత్సం

ద్రోణి ప్రభావంతో

కేశవరాయపురంలో నేలమట్టమైన అరటి

  • అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం
  • నష్టపోయిన ఉద్యాన రైతులు

ప్రజాశక్తి – లావేరు

ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం ఉద్యాన రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా భారీగా వీచిన గాలులకు అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. మండలంలోని కేశవరాయపురం, లావేటిపాలెం, జిజి వలస, లావేరు, సంతవలసలో ఈదురుగాలుల ధాటికి గెలలతో ఉన్న అరటి చెట్లు పూర్తిగా విరిగిపోయాయి. ఒక్క కేశవరాయపురంలోనే సుమారు 25 ఎకరాల్లో లేత అరటి గెలలతో ఉన్న చెట్లు నేలమట్టమయ్యాయి. బొప్పాయి పంటదీ అదే పరిస్థితి. పిందెలతో ఉన్న బొప్పాయి చెట్లు ఈదురుగాలులకు విరిగిపోయాయి. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిన రైతులు, పంట చేతికొస్తున్న సమయంలో నేలమట్టం కావడంతో లబోదిబోమంటున్నారు. మరోవైపు కళ్లాల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న పంట వర్షానికి తడిచిపోయింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు ఈదురుగాలులతో రణస్థలం నుంచి రాజాం వెళ్లే రహదారికి అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ తీగలపై కొన్ని చెట్లు పడడంతో తెగిపోయాయి. విద్యుత్‌శాఖ సిబ్బంది చెట్లను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

➡️