స్వప్రయోజనాల కోసం రాష్ట్రం తాకట్టు

స్వప్రయోజనాల కోసం రాష్ట్ర

సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌, సిపిఎం నాయకులు

  • బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఓడించాలి
  • ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించాలి
  • కాంగ్రెస్‌, సిపిఎం నాయకుల పిలుపు

ప్రజాశక్తి – ఆమదాలవలస

స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వద్ద రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి తాకట్టు పెట్టాయని డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి విమర్శించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన… తొత్తుగా మారిన వైసిపిలను ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక ఒక కళ్యాణ మండపంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో వనరులున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు తప్ప కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవన్నారు. వైసిపి, టిడిపి ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ ప్రయోజనాలు, సొంత అజెండాలతో ముందుకు సాగడంతో జిల్లా అభివృద్ధి దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొస్తే జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు ఒడిశాతో వివాదంలో ఉన్న వంశధార ప్రాజెక్టు సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. పదేళ్లపాటు ఎంపీగా ఉన్న రామ్మోహన్‌ నాయుడు జిల్లాకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 36 రైళ్లు ఆగకుండా వెళ్లిపోతున్నాయని, ఒక్క రైలు అయినా నిలుపుదలకు కృషి చేయలేకపోయారని చెప్పారు. అయ్యప్ప భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైలు వేస్తే, తన కృషితోనే వేయించినట్లు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. నౌపడ – రాయగడ మధ్య బ్రాడ్‌ గేజ్‌ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. జిల్లాల పునర్విభజనతో జిల్లాకు ఐటిడిఎ లేకపోవడంతో గిరిజనులు ఎంతో నష్టపోయారని, జిల్లాలో ఐటిడిఎ ఏర్పాటు చేస్తామన్నారు. టెక్కలిలో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, శివారు భూములకు సాగునీరందిస్తామని హామీనిచ్చారు. పార్లమెంటు సభ్యునిగా తనను, ఆమదాలవలస అసెంబ్లీ అభ్యర్థిగా సనపల అన్నాజీరావును గెలిపించాలని కోరారు. తాము గెలిస్తే నెరవేర్చే 15 హామీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సనపల అన్నాజీరావు, సిపిఎం నాయకులు కె.నాగమణి, కాంగ్రెస్‌ నాయకులు బొత్స రమణమూర్తి, లఖినేని నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

➡️