చంద్రబాబు చేసిందేమిటి..?

జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి

మాట్లాడుతున్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి

  • చెప్పుకునేందుకు ఒక్క మంచి పనైనా చేశారా?
  • ఉద్దానం సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు
  • పలాసలో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం
  • జిల్లాలో పోర్టు, ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం
  • ఇచ్ఛాపురం సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం, కవిటి

జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పనైనా చేశారా అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇచ్ఛాపురం మున్సిపల్‌ కార్యాలయం కూడలి వద్ద మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కిడ్నీ సమస్యల పరిష్కారానికి పలాసలో రూ.80 కోట్లతో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్దానంలో రక్షిత మంచినీటి కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి ఉపరితల జలాలను తీసుకొచ్చి అందిస్తున్నామని చెప్పారు. మూలపేటలో రూ.4,400 కోట్లతో పోర్టు పనులను శరవేగంగా చేస్తున్నామన్నారు. మత్స్యకారుల కోసం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశామని చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా మారుస్తున్నామని చెప్పారు. విశాఖలో అదానీ డేటాబేస్‌ సెంటర్‌, ఇన్ఫోసిస్‌ సెంటర్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల్లో నాలుగు మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సాలూరులో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, కురుపాంలో ఐటిడిఎ నిర్మిస్తున్నామని వివరించారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఉత్తరాంధ్రను ఆరు జిల్లాలుగా చేసి, పాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని చెప్పారు.శ్రీకాకుళం నుంచే అడుగులు పడాలిఎన్నికల మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేసి ఒక విశ్వసనీయతను తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 59 నెలల కాలంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని, ఆరో తరగతి నుంచే డిజిటల్‌ బోధన చేయిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చామన్నారు. విద్యారంగంలో తాము చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్దకే పౌర సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నలకు అండగా నిలిచామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం, సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. 14 ఏళ్లు సిఎం, 40 ఏళ్ల అనుభవమని చెప్పుకునే చంద్రబాబు, పేదల కోసం ఒక్క పథకమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మీ ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలని, ఆ అడుగులు శ్రీకాకుళం జిల్లా నుంచే పడాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయను గెలిపించాలని కోరారు.అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా…ఒక్క అవకాశం ఇస్తే ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్‌ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకున్నానన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పారు.ప్రయాణికుల అవస్థలుమున్సిపల్‌ కార్యాలయం కూడలి వద్ద రోడ్డుపై సభ నిర్వహించడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గం మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పరిసర ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్‌కు వచ్చే వారు సరైన మార్గం తెలియక తిప్పలు పడ్డారు. సభలో వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ కో-ఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, నాయకులు చింతాడ రవికుమార్‌, నరేష్‌కుమార్‌ అగర్వాల్‌, పిరియా సాయిరాజ్‌, నర్తు నరేంద్ర, పిలక రాజ్యలక్ష్మి, నిమ్మాన దాసు, కడియాల ప్రకాష్‌, ఉలాల భారతి దివ్య తదితరులు పాల్గొన్నారు.సిఎం రోడ్‌ షోలో పదనిసలుఇచ్ఛాపురం పట్టణం లో మంగళవారం నాడు మధ్యాహ్నం 3.20కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సభ వేదిక బస్‌ పైకి వచ్చారు. ప్రజల ఉద్దేశించి 4.15వరకు ప్రసంగించారు. సిఎం రోడ్‌ షో సందర్భంగా బద్రత చర్యలు లో భాగంగా భారీగా పోలీస్‌ అధికారులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉదయం 11.నుండి వాహన రాకపోకలు ఆంక్షలు విధిస్తూ 12తర్వాత మరింత కఠినం చెయ్యడం ఆ మార్గం గుండా. వెళ్లసిన ప్రయాణికులు చాల ఇబ్బందులు ఎదురుకున్నారు. భారీ స్థాయి లో జనసమీకరణ చేసిన రోడ్‌ షో కి మీడియా కవరేజీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమి చెయ్యకపోవడం పార్టీ నేతలు కూడా మీడియా కోసం పట్టించుకోపోవ డం వల్ల న్యూస్‌ కవరేజీ కి మీడియా ఇక్కట్లు పడ్డారు.

➡️