రైతులను ఆదుకోండి-వడ్డీతో సహా ధాన్యం బకాయిలు చెల్లించండి : సిపిఎం

Jun 24,2024 13:00 #cpm, #farmers, #grain dues, #interest, #pay, #support

ప్రజాశక్తి – పాలకోడేరు (పశ్చిమ గోదావరి) : ధాన్యం అమ్మకాలు చేసి నెలలు గడుస్తుందని పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక రైతులు ఆర్థికంగా మానసికంగా చితికిపోతున్నారని వడ్డీతో సహా ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ … సోమవారం ఉదయం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కమిటీ రైతులకు మద్దతు, సంఘీభావం తెలిపింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ … పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 800 వందల కోట్ల పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయాయని ఈ నేపథ్యంలో సన్న చిన్న కారు రైతులు, మధ్యతరగతి రైతులు, కౌలు రైతులు నష్టాలు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు తరబడి రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ప్రధానంగా సన్నచిన్నకారు రైతులు, మద్యతరగతి రైతులు, కౌలురైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సార్వాపంటకు పెట్టుబడుల కోసం రైతులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, కరెంటు చార్జీలు ఆలస్యం అయితే వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కానీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలకు మాత్రం అతీగతీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికి రూ.800 కోట్లకు పైగా బకాయిలున్నట్లు తెలుస్తోందన్నారు. ఆకుమడులకు, విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చులకు రైతులు బకాయిల సొమ్ము కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి బాధాకరమన్నారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా తక్షణం చెల్లించాలని బలరాం డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రభుత్వం ధాన్యం మద్ధతు ధర పెంచాలని .రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇవ్వాలన్నారు. కేంద్రం ఇటీవల క్వింటాల్‌ ధాన్యానికి కేవలం మద్ధతు ధర రూ.117 పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. క్వింటాల్‌ ధాన్యం ఉత్పత్తికి సుమారుగా రూ.3 వేలకు పైగా ఖర్చువుతోందని కేంద్రం ప్రకటించిన ధర రూ.2300 మాత్రమే ఉందని అన్నారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపితే క్వింటాలు ధాన్యం మద్ధతు ధర రూ.3 వేలకు పైగా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకొని వరి రైతును ఆదుకుని ఆహార భధ్రతను కాపాడాలని బలరాం కోరారు. కేంద్రం ఉత్పత్తి ఖర్చును తగ్గించి చూపించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ఇస్తున్నట్లుగా ధాన్యానికి బోనస్‌గా క్వింటాకు రూ.500 ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కలిదిండి గోపాలరాజు, కలిదిండి బంగార్రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శేషపు అశ్రియ్య, కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

➡️