ఇండియా అభ్యర్థులను గెలిపించండి

May 8,2024 23:54

మాట్లాడుతున్న సీతారాం ఏచూరి
ప్రజాశక్తి-తాడేపల్లి : దేశ వ్యాప్తంగా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మతతత్వ ఎజెండాతో దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మోడీని గద్దె దించాలన్నారు. ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం తాడేపల్లి పట్టణంలోని నెహ్రుబొమ్మ సెంటర్‌లో బహిరంగ సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన నిర్వహించారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీకి, బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన పోలింగ్‌లో ఎన్నికల సరళి అదే తెలియజేస్తుందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడలిజం కొనసాగాలంటే బిజెపిని ఓడించక తప్పదన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన న్యాయవ్యవస్థ, మీడియాపై తీవ్ర దాడులు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. మెజారిటీగా హిందువుల ఓట్లు పొందడానికి మత ఘర్షణలు సృష్టిస్తున్నారని, దేశ ఐక్యతకు, సమగ్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందని అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పేరుతో రాష్ట్రంలో బుల్డోజర్‌ రాజకీయాలు నడుపుతున్నారని, ప్రశ్నించిన మేథావులు, జర్నలిస్టులు, దేశభక్తులను జైల్లో పెట్టారని విమర్శించారు. ఢిల్లీ, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులను అరెస్టు చేసిన ఈడి ఇంతవరకు ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు. మోడీ పాలనలో న్యాయం అన్యాయమైందని, పౌర హక్కులు భక్షించబడుతున్నాయని చెప్పారు. కార్పొరేట్లు లాభాలు పోగేసుకోవడానికి ప్రధాని మోడీ సహకారం అందిస్తున్నారని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు బిజెపి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. మోడీ పదేళ్ల పాలనలో రూ.16 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు రద్దు చేశారని తెలిపారు. దేశ సంపదను లూటీ చేసి ధనికులను మరింత ధనికులను చేస్తున్నారని, పేదలు మరింత పేదలు అవుతున్నారని చెప్పారు. దేశంలో 42 శాతం యువజనులు డిఎస్‌సి పూర్తి చేసి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని తెలిపారు. దేశంలో బిజెపి అనుసరిస్తున్న విధానాల వల్ల రెండు రాజ్యాలు కనబడుతున్నాయని, ఒకటి ధనికుల రాజ్యం అయితే, మరొకటి పేదల రాజ్యమని చెప్పారు. మణిపూర్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో మహిళలపై, దళితులు, మైనార్టీల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాష్ట్రంలోని గవర్నర్లు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. తమిళనాడు, బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు తలుపు తట్టాల్సి వచ్చిందని చెప్పారు. బిజెపి వల్ల రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు నష్టమని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు సూచించారు. మోడీ తీసుకొచ్చిన దుర్మార్గపు చట్టాలు అన్నింటినీ పార్లమెంట్‌ వేదికగా టిడిపి, వైసిపి బలపరుస్తున్నాయని విమర్శించారు. స్వచ్ఛమైన రాజకీయాలను బలపర్చాలని పిలుపునిచ్చారు. 400 పార్లమెంట్‌ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెబుతున్న మోడీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఎలక్ట్రోల్‌ బాండ్ల ద్వారా రూ.లక్షల కోట్ల అవినీతి చేసిన మోడీ అవినీతిని అంతం చేస్తామని చెప్పడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో పాలకవర్గాల విధ్వంసం : పి.మధు, కె.రామకృష్ణ
రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్న పాలకవర్గ పార్టీలను మార్చాలని ప్రజలు భావిస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు అన్నారు. ఢిల్లీ, ఝార్ఖండ్‌ సిఎంలను జైల్లో పెట్టిన కేసుల మాదిరే జగన్‌పైనా కేసులున్నా ఆయన బయట తిరగడానికి కారణం ఆయన మోడీకి అనుకూలంగా ఉండడమేనన్నారు. చంద్రబాబు, పవన్‌ మోడీ పల్లకీ మోస్తున్నారని దుయ్యబట్టారు. 2014, 2019 ఎన్నికల్లో రామ జన్మభూమి, బాబ్రీ మసీదు, పూల్వామా ఘటనలను అడ్డు పెట్టుకుని బిజెపి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలను ఓడించాలని కోరారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు రైతులకు ఇబ్బందికరమన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య, వేములపల్లి శ్రీకృష్ణ, నిమ్మగడ్డ రామ్మోహనరావు లాంటి ఉత్తమ ప్రజాప్రతినిధుల వారసులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు వెదజల్లుతున్నారని, డబ్బున్న వారికే పోటీ చేసే అవకాశం తప్ప సామాన్యులకు పోటీ చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడానికి ముందుకు వచ్చిన ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కమ్యూనిస్టులు గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటారని చెప్పారు.
గుంటూరు ఎంపి అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగం తీసుకొస్తానంటున్న బిజెపిని, దానికి మిత్రులుగా ఉన్న పార్టీలను ఓడించాలని కోరారు. పేదల జీవనం సజావుగా సాగాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలన్నారు. మంగళగిరి సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ సిఎం నివాసం ఉంటున్న ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాలు కల్పించడంలో లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, భూగర్భ డ్రైనేజీ తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. తాడేపల్లిలో పెద్దఎత్తున మురుగు నిల్వ వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆందోళన వెల్లిబుచ్చారు. తాడేపల్లిలో పేదలకు 20 వేల ఇళ్లు వేయించిన చరిత్ర ఎర్రజెండాదేనన్నారు.

అభ్యర్థులు జంగాల అజరుకుమార్‌, జొన్నా శివశంకరరావుతో అభివాదం చేస్తున్న సీతారాం ఏచూరి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రూ.400 ఉన్న సిలిండర్‌ ధరను రూ.1100కు పెంచారని, ఎన్నికల సందర్భంగా రూ.200 తగ్గించారని, మళ్లీ పెంచుతారని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా అదే దోవలో ఉన్నాయన్నారు. ప్రజలు కొనుగోలు చేయలేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచారన్నారు. ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిష్టి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను చట్టసభలకు పంపాలని కోరారు. కరోనా కాలంలో లక్షలాది మంది చనిపోవడానికి మోడీ కారణం కాదా? అని ప్రశ్నించారు. పాశం రామారావు మాట్లాడుతూ మోడీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. మతతత్వ మోడీ పాలనలో భారతదేశం ప్రమాదంలో పడిందన్నారు. గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్‌కె మస్తాన్‌వలి మాట్లాడుతూ అబద్ధాల కోరు మోడీ అని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో బిజెపి ఓటమి స్పష్టమని తెలియడంతో మోడీ అభద్రతా భావంలోకి వెళ్లిపోయారన్నారు. సిపిఎం నాయకులు డి.శ్రీనివాసకుమారి మాట్లాడుతూ తాడేపల్లిలో టిడిపి, వైసిపి ఓటుకు రూ.4 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నాయని విమర్శించారు. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు అభ్యర్థించడం సరికాదన్నారు. ఈ ప్రాంతంలో ప్రజల కోసం పోరాడింది, ప్రాణాలు త్యాగం చేసింది వామపక్ష పార్టీలేనని స్పష్టం చేశారు. ముందుగా వక్తలను సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు వేదికగా మీదకు ఆహ్వానించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, ఎం.సూర్యారావు, పి.మురళీకృష్ణ, రూరల్‌ కార్యదర్శి డి.వెంకటరెడ్డ్డి, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, కె.శివరామకృష్ణయ్య, మంగళగిరి పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, రూరల్‌ కార్యదర్శి ఎం.జ్యోతిబసు, దుగ్గిరాల మండల కార్యదర్శి జె.బాలరాజు, నాయకులు ఎం.పకీరయ్య, పి.బాలకృష్ణ, వి.రాణి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు దర్శనపు సామ్మేలు, వామపక్ష శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వంపై కర్ణాటక కాంగ్రెస్‌ ప్రచురించిన నయవంచన పుస్తకాన్ని సీతారాం ఏచూరి ఆవిష్కరించారు. ప్రజానాట్య మండలి కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించారు.

➡️