నిత్యం పోరాడే కమ్యూనిస్టులను గెలిపించండి

May 8,2024 00:52

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని, నిరంతరం పోరాటం చేసేది ఎర్రజెండా మాత్రమేనని, ఇండియా వేదిక తరుపున సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకరరావు అన్నారు. మంగళవారం కుంచనపల్లిలో సిపిఎం, కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి రోడ్‌షో ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రధాన రహదారుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి శివశంకరరావు మాట్లాడుతూ పదవులున్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేసేది ఎర్రజెండా అని అన్నారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదల సమస్యలపైన వామపక్ష పార్టీలు నిరంతరం పోరాడుతున్నాయని గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, అవినీతి రహిత పరిపాలన అందిస్తామనే వాగ్దానాలతో కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి, మోడీ నేడు ఎలక్ట్రోల్‌ బ్రాండ్ల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేలా మూడు నల్ల చట్టాలను తేగా రైతులు తమ ఉద్యమం ద్వారా తిప్పికొట్టారన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు దేశాన్ని అమ్మేస్తున్న బిజెపి కబంధహస్తాల నుండి దేశాన్ని కాపాడేందుకు వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, లౌకిక శక్తులతో కలిసి ఇండియా వేదికగా ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేన, లోపాయికారిగా అంటకాగుతున్న వైసిపిలను ఓడించాలన్నారు. ఎమ్మెల్యేగా తనను, గుంటూరు ఎంపీగా సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌కె సలీం మాట్లాడుతూ ప్రజల మధ్య కుల, మత చిచ్చు పెడుతున్న బిజెపిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని చెప్పారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ రైతు, కార్మిక, స్థానిక సమస్యల పైన పోరాటాలు నడిపిన జొన్న శివశంకరరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత ప్రచారాన్ని కాపు సంఘం నాయకులు వై.హనుమంతరావు ప్రారంభించారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నళినీకాంత్‌, మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు పఠాన్‌ సుభాని, సిపిఎం నాయకులు బి.ముత్యాలరావు, జె.రాజ్‌ కుమార్‌, ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కృష్ణ, కె.సాంబశివరావు, ఎస్‌.కె గన్‌, బి.సంసోను, ఎ.రామారావు, ఎ.సుబ్బారావు, ఎ.ఉమామహేశ్వరరావు, బి.గోపిరెడ్డి, ఎ.నాగిరెడ్డి, పి.భార్గవ్‌ పాల్గొన్నారు.

➡️