ఊపు తగ్గిన బిజెపి…ఉన్మాద వ్యూహాలు

Apr 28,2024 05:30 #editpage, #PM Modi

ప్రధానమంత్రి, బిజెపి సర్వాధినేత నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడే మాటలు ఆయన రాజ్యాంగ రీత్యా నిర్వహిస్తున్న బాధ్యతలకే గాక రాజకీయంగా ఆ పార్టీ పరిధిని కూడా మించిపోతున్నాయి. అసలు ఒక పార్టీగా గానీ ఒక ప్రభుత్వాధినేతగా గానీ ఆయన అవన్నీ మాట్లాడవలసిన అగత్యం లేకపోగా రాజ్యాంగం కనీసంగా తెలిసిన వారైనా జీర్ణించుకోలేని పరిస్థితి. నిజానికి మొదటి దశ పోలింగ్‌ సరళి మింగుడుపడకే మోడీ ఏదేదో మాట్లాడుతున్నారని దేశంలో రాజకీయ చర్చను ఎక్కడికో తీసుకుపోజూస్తున్నారని పరిశీలకులు, మీడియా మొత్తంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో బిజెపి అనుకూలమైన వారు కూడా ఆశ్చర్యాన్ని దిగమింగి ఏదోవిధంగా సమర్థించేందుకు తంటాలు పడుతున్నారు. రెండో విడత పోలింగ్‌ కూడా అందుకు పెద్ద భిన్నంగా లేదని సమాచారం. కాబట్టి మోడీ విడ్డూర వాక్కులు విజృంభించడమే గానీ తగ్గుముఖం పట్టక పోవచ్చు. దీని ద్వారా ఆయన ఆశించే ప్రయోజనాలు రెండు: ఒకటి అలవాటైన మత రాజకీయాలను రగిలించడం, రెండోది తలా తోక లేని ఆరోపణలతో ప్రజలను అయోమయానికి గురిచేయడం. మొదట ఆయన రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ గెలిస్తే మీ ఆస్తిపాస్తులు తీసుకుని ముస్లింలకు ఇచ్చేస్తుందని భయపెట్టారు (దానిపై ప్రజాశక్తిలో ఇప్పటికే పలు వ్యాఖ్యలు వచ్చాయి). అది కాస్త బెడిసి కొట్టడంతో మొత్తం ఆస్తులకే ఎసరు పెడతారని కొత్తపాట అందుకున్నారు. ఇందుకు మద్దతుగా ఒకప్పటి ఆ పార్టీ సలహాదారు శ్యామ్‌ పిట్రోడా ఎప్పుడో చేసిన ఒక వ్యాఖ్యను తీసుకొచ్చారు. బాగా ధనాఢ్యులైన వారు ఆస్తిని వారసులకు అప్పగించి చనిపోతే వారి మరణానంతరం వారసత్వ పన్ను వేయొచ్చుననేది ఆయన ప్రస్తావించిన అంశం. అమెరికాలో 45 శాతం, జపాన్‌లోనైతే ఏకంగా 55 శాతం వున్న ఈ పన్ను మొత్తాన్ని ఆస్తి విలువ నుంచి మినహాయించుకుని ఇవ్వాలనేది ఆ చట్టాల సారాంశం. భారత దేశంలో అలాంటి చట్టం లేదు గానీ ఆర్థిక సమానత్వం, సమాజ ప్రయోజనాల కోసం ఆస్తిని తీసుకోవడం వంటి అంశాలు రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లోని 39(బి) పరిధిలోవి. దాని అమలుకు సంబంధించిందే 31(సి) యజమాని లేని ఆస్తులను లేదా అవసరమైన వాటిని తీసుకోవడానికి అవకాశమిస్తున్న మాట నిజం. ఇందుకు భిన్నంగా ప్రైవేటు ఆస్తికి 19వ అధికరణం రక్షణనిస్తుంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో ఇవన్నీ తెర వెనక్కుపోయిన మాట నిజమేగాని మౌలికంగా ఆ భావన తప్పు కాదు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి సందర్భాలలో ఈ రెంటికీ మధ్యనే చర్చ జరిగింది.

ఎందుకీ ప్రచారాలు? కోర్టులేమన్నాయి?
కమ్యూనిస్టు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు దాన్ని దెబ్బ తీయడం కోసం ఆస్తులు లాగేసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి ప్రగతి నిరోధక శక్తులు. ఇందిరా గాంధీ కాస్త భూసంస్కరణలంటూ హడావుడి చేసిన సమయంలోనూ వీరంతా ఇదే విధంగా గగ్గోలు పెట్టారు. వాస్తవానికి ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితిలో ప్రజల ఆస్తులు ప్రభుత్వాలే ప్రైవేటు పరం చేయడం పరిపాటిగా మారింది. మోడీ హయాంలోనే పెట్టుబడుల ఉపసంహరణ మంత్రంగా మారింది. ఇదే విశాఖ ఉక్కు వరకూ పాకింది. దానిపై ప్రజాందోళనకు కేంద్రం స్పందించడం లేదు కూడా. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులు ప్రవేటు పరం చేయడంలో ముందున్న మోడీ వ్యక్తిగత ఆస్తులకేదో ముప్పు దాపురిస్తుందని భయపెట్టడం వంచనాశిల్పం మాత్రమే! హిందూ ముస్లిం తేడా లేకుండా మిగిలిన వారిని కూడా హడలగొట్టడంలో ఆయన ఆలోచన ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. ఆసక్తికరం ఏమంటే ఈ సమయంలోనే సిజెఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సమస్య చేపట్టింది. ముంబయి ప్రాపర్టీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఎప్పుడో వేసిన ఒక పిటిషన్‌ను దుమ్ము దులిపి తీసింది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు ఆస్తిని తీసుకోవడం ఆదేశిక సూత్రాల్లోని 39(బి) సారాంశం. ధర్మాసనంలోని జస్టిస్‌ నాగరత్న దీనిపై కీలక వ్యాఖ్యలే చేశారు. సరళీకరణ యుగంలో ప్రైవేటీకరణకు ఇది విరుద్ధం కదా అని అడిగారు. తాను మార్క్సిస్టుల తరహాలో ఆస్తి పంపిణీ గురించి చెప్పడం లేదనీ, అయితే ఈ అంశానికి ప్రాధాన్యత వుంటుందని ఆయనన్నారు. దీనిపై ఇది చివరకు ఏ దిశలో పయనించేదీ ఓపిగ్గా వేచి చూడవలసిందే. కానీ మోడీ మాత్రం ఈలోగానే ఏదో జరిగిపోతుందనీ అందరి ఆస్తి పోతుందని గగ్గోలు పెడుతున్నారు. శ్యామ్‌ పిట్రోడా ఇతర వీడియోలు కూడా తవ్వి తీస్తున్నారు. ఇంతా చేసి పిట్రోడా ఇప్పుడేమీ కాంగ్రెస్‌తో లేరు. అసలు క్రియాశీల రాజకీయవేత్తా కాదు. అయినా బిజెపికి జనాన్ని కంగారు పెట్టే ఏదో అంశం కావాలి కదా!

సకల వర్గాల్లో ఆందోళన
ఆస్తిక వాదమంతా తమదేనని మత రాజకీయాలు నడిపే బిజెపి ఆస్తి విషయాల వైపు రావడం యాదృచ్ఛికమేమీ కాదు. అంతెందుకు? ముస్లింలకు ఆస్తి ఇస్తారంటూ మొదటి రోజు చెప్పిన మోడీ దానిపై విమర్శలు వచ్చాక కూడా మార్చుకోకపోగా హనుమాన్‌ జయంతి రోజున హనుమాన్‌ చాలీసా చదవనివ్వడం లేదని కొత్త ఆరోపణ చేశారు. ఇక్కడో విశేషం వుంది. నరేంద్ర మోడీని ‘నమో’ అంటుంటారు భక్తులు. నిజానికి నమో నమ:శివాయ అనేది శివభక్తులు వాడేది. కానీ కాశీలో పోటీచేసి గెలిచిన మోడీకే ఆ విశేషం తగిలించేశారు. అలాగే హనుమాన్‌ చాలీసా తరహాలో మోడీ చాలీసా కూడా రచించారు! ఆయన వ్యక్తి ఆరాధన అంత ఎత్తుకు తీసుకుపోవడం సంఘ పరివార్‌ వ్యూహంలో భాగమే. అయితే రాను రాను ఈ ప్రభ మసకబారిందని వారు గ్రహించక తప్పలేదు. మరే సమస్య లేనట్టు మోడీ పేరే ఊపేస్తుందన్న భావం కరిగిపోయింది. మతాన్ని, రాజకీయాలను కలిపే పాత పాచికలూ పారడం లేదు. స్థానిక నాయకులెవరైనా జాతీయంగా మోడీ సరిపోతాడన్న ప్రచారం కర్ణాటక నుంచి చాలా చోట్ల వీగిపోయింది. అనేక అంశాలలో కేంద్ర నిరంకుశత్వం వారి గడపలను తాకింది. ఈ సమయంలో మోడీ సభలకు, చిట్కాలకు అసలు స్పందన తగ్గిపోతున్నది. వివిధ పార్టీల కీలక నాయకులను అసలు బిజెపిలోనే స్థానికంగా పట్టు కలిగిన నేతలను కూడా తోసిరాజన్న మోడీ ధోరణిని వారు ఆమోదించలేకపోతున్నారు. చాలా సర్వేలలో సంకేతాలు వచ్చినట్టు నిరుద్యోగం, ధరల పెరుగుదల, దారిద్య్రం వంటివి వారిని ఎంతగానో కలవర పరుస్తున్నాయి. వ్యవసాయ రంగానికి మరో సమస్య. మీడియా, విద్యాలయాలు, మేధావి వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవ్యవస్థ, కవులు, రచయితలు, ఆఖరుకు సినిమా రంగం కూడా మోడీ హయాంలో ముదిరిపోయిన ఏకపక్ష ఆధిపత్యానికి గురికాక తప్పలేదు. రాజకీయ సేవలో మతాన్ని వాడుకోవడం కోసం మోడీ మతాచార్య పాత్రనూ తనే లాగేసుకోవడంతో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ఒక వివాదంగా మారింది. ఇక ఆరుగాలం శ్రమ పడే రైతుల ఆగ్రహావేదనలు ఆందోళనగా ప్రజ్వరిల్లి దేశాన్ని ప్రతిష్టంభనకు గురిచేశాయి. ఈ సమయంలో కాశ్మీర్‌ 370, సరిహద్దులలో ఉద్రిక్తతలు, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ వంటి ఊపునిచ్చే వాతావరణం మారుతున్నది. మోడీని త్రీడీలో చూపిన ప్రచార పొర కూడా కరిగిపోతున్న దశ. అన్ని చోట్లా అన్ని సందర్భాల్లో అన్ని వేదికల్లో ఆయనే ప్రత్యక్షమై ప్రబోధకుడుగా ప్రభవించడం, ప్రజలు ఆమోదించడం బాగా తగ్గింది. బిజెపిలోనూ సంప్రదాయ నాయకత్వం శ్రేణులు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఎ.పి, తెలంగాణలలోనే బిజెపి శిబిరాలు గమనిస్తే వాస్తవం తెలుస్తుంది. ఆ పార్టీ పెద్ద శక్తిగా లేని చోట్లనే ఇలా వుంటే ఒక పునాది గల చోట్ల నాయకులు, సీనియర్‌ కార్యకర్తలు, అభిమానులు ఎలా స్పందిస్తారో తేలిగ్గా ఊహించవచ్చు. రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రులైన వారితో సహా బడిపిల్లల్లా బందిఖానాలకు పంపిస్తుంటే ఎన్నుకున్న ప్రజల్లోనూ ప్రతికూలత రావడం సహజం. ఇక ఆయనను ఆశ్రయించుకున్న వర్గాలేమో అదానీ అయినా, రామదేవ్‌ బాబా అయినా రకరకాలుగా దొరికిపోతున్న దశ. మోడీపై మొహం మొత్తడమేగాక నిరాసక్తత, నిరసన కూడా పెరగడానికి ఇవన్నీ కారణమైనాయి.

చంద్రబాబు వింత లెక్కలు
విచిత్రమేమంటే ఇలాంటి దశలోనే ఎ.పిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్‌ కళ్యాణ్‌ వెంటబడి మరీ ఎన్‌డిఎగా పొత్తు కుదర్చుకున్నారు. అది ఎంత అస్తవ్యస్తంగా నడుస్తున్నదీ అనుదినం చూస్తున్నాం. ఆ పార్టీ కీలక నేతలే కలసిరావడం లేదంటే అదేదో రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పైన కోపమే కాదు. మోడీ పైనా నిరసనే. కాకుంటే ఈ సమయంలోనూ మోడీని దార్శనికుడుగా పొగడ్డం చంద్రబాబుకే చెల్లింది. తాజాగా ఇంటర్వ్యూలో ఆర్ణబ్‌ గోస్వామి మోడీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అడిగినప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసమని ఆయన జవాబివ్వడం నవ్వు తెప్పిస్తుంది. బిజెపితో పొత్తు టిడిపికి నష్టమని ఆ పార్టీ వారే భయపడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించడానికి అవసరమైందని చంద్రబాబు సమర్థించుకున్నారు. అంతకంటే కూడా ఎన్నికల ఫలితాలపై అంచనా అడిగితే 400 స్థానాలపైన వస్తాయని బాబు చెప్పడం అవాస్తవికతకు పరాకాష్ట. పురందేశ్వరి కూడా తమ పొత్తు పార్టీలో కొందరికి ఇష్టం లేదని ఇంటర్వ్యూలలో చెప్పడం గమనించగలం. బిజెపికి పూర్తి మెజార్టీ రాకూడదని కోరుతున్నానని జగన్‌ పదేపదే అనడంలో ఉద్దేశం స్పష్టమే. స్వంతంగా మెజార్టీ రాకున్నా ఇలాంటి వారందరితో కలసి పాలన చేద్దామన్నది మోడీ వ్యూహం. అందుకే పెద్ద ప్రయోజనం లేదని తెలిసినా టిడిపితో చేతులు కలిపి వైసీపీతోనూ సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. బిజెపి, టిడిపి నేతలు అవలీలగా అటూ ఇటూ మారి కండువాలు మార్చుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా వున్నామంటూ వచ్చిన చిరంజీవి వంటి మెగాస్టార్లు బిజెపితో పొత్తు మంచిదని కితాబులిస్తున్నారు. తెలంగాణలోనూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని శాపనార్ధాలు పెడుతూ పరోక్షంగా బిజెపి ప్రయోజనం నెరవేరుస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నోటా అదే పాట వినిపిస్తున్నది. తెలుగు నేలపై కాషాయ రాజకీయ క్రీడలను ఈ పరిణామాలే స్పష్టం చేస్తాయి. అయితే స్వతహాగా ఆ పార్టీ ఇక్కడేదో దూసుకొస్తుందనేది కల మాత్రమే. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య నాటకం నడపాలని చూసిన బిజెపి పథకాలు కూడా వేగంగానే తేలిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనివార్యంగా బిజెపిపైనా తీవ్రంగా స్పందించక తప్పలేదు. ఎ.పి లో పవన్‌, చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా, తెలంగాణ నేతలు ఊగిసలాడినా వ్యతిరేకత తగ్గకపోవడం పరిస్థితికి ప్రతిబింబమే. ఇప్పుడు బిజెపికి 300-400 స్థానాల పాట ఎవరూ పాడటం లేదు. కులమతాలను, కుటుంబాలను, ఆర్థిక సాంస్కృతిక వ్యవహారాలను ఆందోళనకు గురిచేస్తే తప్ప గట్టెక్కలేమని మోడీనే గుర్తిస్తున్న స్థితి రెండో దశలోనే కనిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన సీట్ల వివరాలు, గత నేపథ్యాలు కూడా అందుబాటులో వున్నాయి. మతతత్వ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయకూడదని ప్రజలుకూడా గ్రహిస్తున్నారా అనే ప్రశ్నకు ఈ పరిణామాలు ఆస్కారమిస్తున్నాయి. దానిపై పోరాటం పెంచడానికి ఇదే సమయమనీ గుర్తు చేస్తున్నాయి.

తెలకపల్లి రవి

➡️