జీవితాంతం ప్రజా పక్షమే

కామ్రేడ్‌ గానుగుల తరుణాచారి శ్రీకాకుళం జిల్లా తొలి తరం కమ్యూనిస్టు నేత. తన యావత్‌ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు. తరుణాచారి 1899లో ఇచ్చాపురం దగ్గర కుగ్రామంలో జన్మించారు. చిన్నతనంలో అల్లరి చిల్లరగా తిరిగేవాడిని వాళ్ళ మేనమామ చిత్రాడ మల్లయ్య స్వర్ణకార పని నేర్పడం కోసం సోంపేట మండలం మామిడిపల్లి తీసుకువచ్చారు. మార్పు పద్మనాభం, బెందాళం గవరయ్యతో పాటుగా తరుణాచారి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1927లో గాంధీజీ ఇచ్చాపురం వచ్చినప్పుడు పుల్లేల శ్యామ్‌ సుందర్‌రావు ఇంటి వద్ద ఉన్నారని తెలుసుకొని వారు ముగ్గురూ ఇచ్చాపురం వెళ్లి గాంధీని చూశారు. స్వాతంత్య్రోద్యమ పిలుపులో భాగంగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గంజాం జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా మార్పు పద్మనాభం, కార్యదర్శిగా తరుణాచారి పనిచేశారు. 1934లో జమిందారీ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఏజెన్సీ మైదాన ప్రాంతం ఉద్దానం గ్రామాల్లో పద్మనాభంతో కలిసి అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. 1936లో అఖిల భారత కిసాన్‌ సభ ఏర్పడింది. 1937లో ఇచ్చాపురంలో ప్రారంభమైన రైతు రక్షణ యాత్ర నడపడంలో తరుణాచారి క్రియాశీలక పాత్ర పోషించారు. 1940లో ఏప్రిల్‌ 1న మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో వీర గున్నమ్మతో పాటు ఆరుగురు అశువులు బాసిన తర్వాత, ఆ గ్రామాల్లో నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు రైతు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తరుణాచారి ముఖ్య పాత్ర పోషించారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా పద్మనాభం, గవరయ్య, తరుణాచారితో పాటుగా మామిడిపల్లి గ్రామస్తులు రాంబుడ్డి సారథి, కప్పల సారథి, కర్నేని రామదాసు కడలూరు జైలుకు వెళ్లారు. కర్నేని రామదాసు అనారోగ్యంతో మృతి చెందారు. కడలూరు జైల్లో ఎ.కె.గోపాలన్‌ పరిచయంతో కలిగిన సైద్ధాంతిక అవగాహనతో కారాగారంలోనే కమ్యూనిస్టులుగా మారి శ్రీకాకుళం జిల్లాలో తొలి తరం కమ్యూనిస్టులుగా ఆవిర్భవించారు. మామిడిపల్లిలో రైతు సంఘం ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేపట్టారు. మామిడిపల్లి అంటేనే కమ్యూనిస్టు గ్రామం. మామిడిపల్లిలో పాతినప్పల స్వామి, గోరకల వెంకయ్య, తులుకుల, కురియాల గంగయ్య, గురుమూర్తి, సింహాద్రి వంటి అనేకమంది కామ్రేడ్లు తరుణాచారి స్ఫూర్తితో బొడ్డపాడు, నీలావతి, మాకనపల్లి మొదలగు గ్రామాల్లో ప్రచారాలు నిర్వహించేవారు. మామిడిపల్లి గ్రామ మొదటి ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై 15 ఏళ్ల పాటు పని చేసిన ఘనత తరుణాచారిదే. మామిడిపల్లి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒకరోజు తరుణాచారిని అరెస్ట్‌ చేయడానికి పోలీసులు మామిడిపల్లి వస్తే ఆయన ఆచూకీ ఎవరూ చెప్పలేదు. దీంతో పోలీసులు గ్రామం మీద విరుచుకుపడి లాఠీ చార్జీ చేసి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. అయినప్పటికీ ఎవరూ చెప్పలేదు. దీంతో తన వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయనే పోలీసులకి లొంగిపోయారు. పోలీసులు అరెస్ట్‌ చేసి టెక్కలి సబ్‌ జైలుకు తరలించారు. 1962లో మామిడిపల్లి దగ్గరి తోటలో పది రోజులు పాటు శిక్షణా తరగతులు నిర్వహించారు తరుణాచారి. ఈ శిక్షణా తరగతుల్లోనే పంచాది కృష్ణమూర్తి, నిర్మలకు పెళ్లి చేశారు. 1953లో అమానీ రైతుల పోరాటం పెద్ద ఎత్తున నిర్వహించారు. టెక్కలి రెవిన్యూ డివిజన్‌లో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడంలో పద్మనాభంతో పాటు తరుణాచారి క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పద్మనాభం 13 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ ఏర్పాట్లన్నీ తరుణాచారి చూసేవారు. ఆ పోరాటం విజయవంతమైంది. 1958-59 కాలంలో పైడిగాం, చీపి, హంసరాలి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. చీపి ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 125 గ్రామాలు 8,500 ఎకరాలకు నీరు అందుతుందని, అదేవిధంగా పైడిగాం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని బేసి రామచంద్రపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ఏఐకేఎస్‌ అఖిలభారత నాయకులు చలసాని వాసుదేవరావు హాజరయ్యారు. 1964లో పార్టీలో సైద్ధాంతిక విభేదాలు వచ్చినప్పుడు తరుణాచారి సిపిఎం వైపు ఉన్నారు. తన తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు ఆశయాలకు అనుగుణంగా జీవనం గడిపారు. 1985 మార్చి 13వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమైనది, ఆచరణీయమైనది.

(నేడు మామిడిపల్లిలో…శ్రీకాకుళం జిల్లా తొలి తరం కమ్యూనిస్టు నేత కామ్రేడ్‌ గానుగుల తరుణాచారి వర్ధంతి సభ, స్థూప ఆవిష్కరణ)

– వ్యాసకర్త : డి. గోవిందరావు, సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి

➡️