సైనిక్‌ స్కూళ్ల ప్రైవేటీకరణ, కాషాయీకరణ

రక్షణ రంగంలో చేరుతున్న వారిలో చాలావరకు సైనిక పాఠశాలల నుండి వస్తున్నారని గమనించిన బిజెపి వాటిపై దృష్టి సారించింది.
విద్యను గరపుతూనే క్రమశిక్షణతో కూడిన మెరికల్లాంటి యువతను దేశానికి అందించేందుకు స్థాపించబడినవే సైనిక పాఠశాలలు. వీటిని మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ ఆధ్వర్యంలో సైనిక స్కూల్స్‌ సొసైటీ ద్వారా నిర్వహిస్తారు. ఇక్కడ విద్యార్థులు కులమతాలకు అతీతంగా, జాతి ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అకుంఠిత దేశభక్తితో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి విద్వేషాలకు, వైషమ్యాలకు తావుండదు. అటువంటి సైనిక పాఠశాలలను నూతన విద్యా విధానం పేరుతో బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేయడానికి పూనుకుంది.
2022 వరకు 30 సైనిక పాఠశాలల్లో ఆరవ తరగతిలో 3000 మంది ప్రవేశం పొందేవారు. ప్రభుత్వ ఆధీనంలో వున్న ఈ విద్యా సంస్థలను 2022 నుండి పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పిపిపి) కిందకు మార్చింది. ప్రతీ సంవత్సరం 5000 మంది విద్యార్థులు చేరేలా దేశవ్యాప్తంగా 100 పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. సైనిక పాఠశాలలను నడుపుకో’మంటూ ప్రైవేట్‌ వారికి తలుపులు బార్లా తెరిచింది. ఎన్‌ఆర్‌సి, సిఎఎ లో చేసిన విధంగానే ఇక్కడ కూడా హిందూ స్వచ్ఛంద సంస్ధలకు తప్పితే క్రిస్టియన్‌, ముస్లిం సంస్థలకు అనుమతులు ఇవ్వబోమని చెప్పడం లౌకికతత్వానికి విరుద్ధం. సైనిక పాఠశాలలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తూ మతం రంగు పులమడం కాషాయ పైత్యానికి పరాకాష్ట. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పబ్లిక్‌ స్కూల్‌, మహారాష్ట్ర లోని విఠల్‌రావ్‌ విఖే పాటిల్‌ స్కూల్‌, రాజస్థాన్‌ లోని భారతీయ పబ్లిక్‌, సాంగ్లీ లోని ఎస్‌.కె ఇంటర్నేషనల్‌ స్కూల్‌, మధ్యప్రదేశ్‌ లోని సైనా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వంటివన్నీ కొత్తగా సైనిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులు పొందిన పాఠశాలలు. ఇవన్నీ బిజెపి నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు నడుపుతున్నవే. గత విద్యా సంవత్సరం అనుమతులు పొందిన 40 పాఠశాలల్లో 62 శాతం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, బిజెపి నాయకులు, వారి మిత్రులు వున్నారు. దేశభక్తి ముసుగులో దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ ఆప్తుమిత్రుడు అదానీకి చెందిన అదానీ వరల్డ్‌ స్కూల్‌ కూడా ఇందులో చోటు దక్కించుకుంది. నెల్లూరు లోని కృష్ణపట్నం పోర్టును అప్పనంగా ఇవ్వడంతో పాటు తన స్కూల్‌ని సైనిక్‌ స్కూల్‌గా మార్చడానికి అనుమతించిందంటే ఎంత ప్రేమ లేకపోతే అలా చేస్తుంది? మన రాష్ట్రంలో దీనితో పాటు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉన్న పూజా ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు అనుమతి లభించింది. 2022 జూన్‌లో దీనిని చిన్నజీయర్‌ స్వామి ప్రారంభించారు. సంవత్సరం తరువాత దాని నిర్వాహకుడు రాజారెడ్డి అదే స్కూల్‌లో అనుమానస్పదంగా మృతి చెందాడు. బాబ్రీ మసీదును కూల్చి రామమందిరం నిర్మించడానికి జరిగిన సుదీర్ఘ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన రితంబర ఏకంగా రెండు పాఠశాలలకు అనుమతులు పొందారు. ఇటువంటి వారు విద్యాసంస్థలను, అందులోనూ సైనిక పాఠశాలలను నడపడం వలన విద్యార్థుల్లో మత సామరస్యానికి బదులు మత విద్వేషం, జాతి ఐక్యతకు బదులు జాత్యహంకారం నింపబడుతుంది. ఇది దేశ రక్షణను అభద్రతా భావంలోకి నెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. హిందూ అతివాద నేత బి.ఎస్‌ మూంజ్‌ 1937లో నాసిక్‌లో స్ధాపించిన భోంస్లా మిలటరీ స్కూలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ప్రస్తుతం సెంట్రల్‌ హిందూ మిలటరీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నది. 2006 నాందేడ్‌, 2008 మాలెగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారు భోంస్లా మిలటరీ స్కూల్‌లో శిక్షణ పొందినవారేనని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక శాఖ ఆరోపించింది. భవిష్యత్తులో ఈ సైనిక పాఠశాలలు దేశభక్తి కలిగిన యువతరానికి బదులు మతోన్మాదంతో బుసలు కొట్టే వారిని దేశానికి అందిస్తాయి. వీరిని హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వారిపైకి రెచ్చగొడతాయి. అందుకే రక్షణ రంగాన్ని కూడా రెగ్యులర్‌గా కాకుండా కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేస్తూ నాలుగు సంవత్సరాలకే పరిమితం చేస్తున్నది.
బిజెపి దేశంలో విధ్వంసానికి పూనుకొంటున్నది. మనుస్మృతిని అమలు చేసేందుకుగాను నియంతృత్వ పోకడలు పోతున్నది. మొదట విద్య ద్వారా హిందూత్వ భావజాలాన్ని చిన్నారుల మెదళ్లలోకి ఎక్కించాలని చూస్తున్నది. మతాలకు అతీతంగా లౌకిక రాజ్యాన్ని స్థాపించడానికిగాను…మనందరం ఈ కాషాయీకరణను ముక్త కంఠంతో ఎదిరిద్దాం.

– డి.రాము,ఎస్‌.ఎఫ్‌.ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు,
సెల్‌ : 9705545164

➡️