సిగ్గుచేటు!

May 8,2024 05:15 #editpage

నారీ శక్తి, బేటీ బచావో – బేటీ పఢావో… లాంటి నినాదాలు ప్రధాని నుంచి కమలం పార్టీ చిన్నా చితకా నేత వరకూ అలవోకగా జాలువారుతూనే ఉంటాయి. భారత మాత పుత్రికల కన్నీళ్లను తుడవడంలో, వారి మాన ప్రాణాలనూ, గౌరవాన్ని కాపాడటంలో మోడీ సర్కారు ఎక్కడుంది? ప్రజ్వల్‌ రేవణ్ణ ఉదంతం నుంచి, బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌, కులదీప్‌సింగ్‌ సెంగార్‌, బిల్కిస్‌ బానో అత్యాచార కేసులో నిందితుల వరకూ… అన్నింటా బిజెపి సర్కారు బరితెగించి మరీ నిందితులకు కొమ్ముకాసిన ఘటనలే మనముందున్నాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ హసన్‌ సిట్టింగ్‌ ఎంపి. ఈ ఎన్నికల్లో బిజెపి, ఎన్‌డిఎ బలపరిచిన జెడిఎస్‌ అభ్యర్థి. ప్రజ్వల్‌ అత్యాచారాలు, అకృత్యాలపై దాదాపు ఐదు నెలల క్రితమే ప్రధానికి, హోం మంత్రికి లేఖ రాశానని స్వయంగా ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు దేవరాజ గౌడ చెబుతున్నాడు. జెడిఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని, ప్రజ్వల్‌ రేవణ్ణ స్త్రీ లోలుడని, వందలమందిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసి, వాటిని వీడియోలు తీసి, పెన్‌ డ్రైవ్‌లో దాచుకున్నాడని, ఆ పెన్‌ డ్రైవ్‌ ఒకటి తన దగ్గరకు, మరొకటి కాంగ్రెస్‌ దగ్గరకు వచ్చాయని, ప్రధానికి, హోం మంత్రికి 2023 డిసెంబర్‌లోనే లేఖ రాశాడు. అయినా… ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని.. స్వయంగా ప్రధాని మోడీ ప్రజ్వల్‌ను గెలిపించాలంటూ ఊరూవాడా ప్రచారం చేయడం, ఏప్రిల్‌ 26న హసన్‌ ఎంపి స్థానానికి ఎన్నిక పూర్తవడం జరిగిపోయాయి. ఆ తరువాత ప్రజ్వల్‌ పెన్‌డ్రైవ్‌లోని 2,976 వీడియోలు వెలుగుచూసిన అనంతరం కొద్ది గంటల్లోనే… ఆయన విదేశాలకు పారిపోయాడు. ఎట్టకేలకు ఫిర్యాదు చేసిన మహిళ కిడ్నాప్‌ కేసులో హెచ్‌డి రేవణ్ణను సిట్‌ అరెస్టు చేసింది. ఇలాంటి సమయాల్లో తక్షణం స్పందించాల్సిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ, హోం శాఖ, మహిళా కమిషన్‌ ఉలుకుపలుకూ లేదు. అన్ని సందర్భాల్లోనూ అలానే ఉన్నాయా? లేదే? పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సందేశ్‌ఖలి ఘటనపై ప్రధాని స్వయంగా స్పందించారే! ఈ శాఖలన్నీ కట్టకట్టుకుని చర్యలు చేపట్టాయి కదా? ఐదు నెలల క్రితమే తెలిసినా కేంద్ర హోం శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదు? రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయేందుకు ఎందుకు సహకరించారు? ప్రతిపక్ష పార్టీల నేతలో, మైనారిటీలో… అయితే ఇలానే స్పందిస్తారా? అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌, న్యూ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థల నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 133 మంది సిట్టింగ్‌ ఎంపి, ఎమ్మెల్యేలపై కేసులుంటే… వారిలో 44 మంది భారతీయ… జనతా పార్టీ వారే! 2014-22 మధ్య మహిళలపై నేరాలు 31 శాతం పెరిగాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) లెక్కలే చెబుతున్నాయి.
లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని తమ కెరీర్లను పణంగా పెట్టి 40 రోజులకుపైగా మహిళా రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాతే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నేటికీ అరెస్టు చేయలేదు. బ్రిజ్‌భూషణ్‌ కొడుకుకు ఎంపి సీటిచ్చి బిజెపి గౌరవించింది. ఇప్పటికే మరో కొడుకు ఎమ్మెల్యే. దేశంలోని కోట్లాది మంది కుమార్తెల మనోధైర్యాన్ని దెబ్బతీశారన్న ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ వ్యాఖ్య అక్షర సత్యం. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావోలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, ఆమె తండ్రి మరణానికి కారకులయ్యారన్న కేసులో దోషి కులదీప్‌సింగ్‌ సెంగార్‌కు మద్దతు పలకడం, అదే రాష్ట్రంలోని హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం చేసి, నిప్పంటించడం, ఆమె మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చి మరణించినా, నిందితులు నిర్దోషులుగా బయటపడటం… ఇలా ఎన్నో ఘటనలు. బిల్కిస్‌ బానో కేసులో నిందితులను గుజరాత్‌ ప్రభుత్వం పెరోల్‌పై విడుదల చేయడం, వారిని కమలం పార్టీ శ్రేణులు పూలమాలలతో సత్కరించడం.. కాశ్మీర్‌లో సంచార జాతి బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఆందోళన చేయడం, మణిపూర్‌ మారణహోమంలో నగ కవాతులు, తాజాగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద్‌బోస్‌పై లైంగిక వేధింపుల కేసు… ఇలా ఎన్నో దురాగతాలు మోడీ పాలనలో సాగిపోతున్నాయి. ఈ సిగ్గుమాలిన రాజకీయాలకు ముగింపు పలకాల్సింది ఓటు తోనే!

➡️