The Goat Life review : ది గోట్‌ లైఫ్‌ : ఆడు జీవితం మూవీ రివ్యూ

Mar 28,2024 18:43 #movie, #The Goat Life review

ప్రముఖ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’. ఈ చిత్రం దాదాపు ఆరేళ్లపాటు చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాలో సుకుమారన్‌కి జోడీగా ప్రముఖ నటి అమలాపాల్‌ నటించారు. మరి సుదీర్ఘకాలంపాటు తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందామా..?!

కథ
నజీబ్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) తెలంగాణాలోని ఓ ప్రాంతంలో ఇసుక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. నజీబ్‌ భార్య సైను (అమలాపల్‌) గర్భవతి. తల్లిని, భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే నజీబ్‌కి ఒక ఇల్లు కట్టుకోవాలని, పుట్టబోయే బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కలలు కంటాడు. ఆ లక్ష్యంతోనే నజీబ్‌ సౌదీకి వెళ్లి డబ్బులు సంపాదించి తిరిగి రావాలనుకుంటాడు. తాను అనుకున్నట్టుగానే నజీబ్‌ తన స్నేహితుని సాయంతో సౌదీకి వెళతాడు. ఎన్నో కష్టాలతో అక్కడివెళ్లిన నజీబ్‌ను తనతోపాటు వచ్చిన హకీమ్‌ (కేఆర్‌ గోకుల్‌)ని దళారీ మోసం చేస్తాడు. వీరిద్దరినీ వేర్వేరుచోట్ల పనికి పెడతారు. నజీబ్‌ని ఎడారిలో గొర్రెలు, మేకల్ని కాసే పనిలో పెడతారు. అక్కడికెళ్లిన తర్వాత నజీబ్‌కి ఎదురైన సమస్యలేంటి? అక్కడి నుంచి నజీబ్‌ మళ్లీ తన కుటుంబం చెంతకు చేరతాడా? లేదా అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
90వ దశకంలో కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి చాలా కష్టాలు పడ్డాడు. అతను ఒక్కడే ఎడారిలో గొర్రెల్ని, మేకల్నికాస్తూ ఎన్నోకష్టాలు పడ్డాడు. నజీబ్‌ జీవిత కథ ఆధారంగానే ప్రముఖ రచయిత బెన్యామిక్‌ ‘గోట్‌ డేస్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగానే ప్రముఖ దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏజెంట్‌ చేతిలో దారుణంగా మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథ ఎక్కడా బోర్‌ కొట్టకుండా దర్శకుడు కథను ముందుకు నడిపించాడు. హీరో క్యారెక్టర్‌తో ప్రేక్షకులు కనెక్ట్‌ అయితే నజీబ్‌ పడే కష్టాన్ని కూడా వారే పడుతున్నట్టుగా ఫీలవుతారు. ఈ సినిమాలో అదే ప్రత్యేకం. స్క్రీన్‌ ప్లే, హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటన అద్భుతంగా ఉంది. ఇక ఫస్టాఫ్‌లో చెప్పుకోదగ్గ సన్నివేశం ఏమిటంటే.. ఎడారిలో నీళ్ల కోసం నజీబ్‌ పడే బాధను చూపిస్తూనే.. గతంలో తాను నది ఒడ్డున ఎలా బతికాడనేది దర్శకుడు ఎంతో హృద్యంగా చూపించాడు. ఈ ఒక్క సీన్‌తో తాను కూడా గొర్రెల మందల్లో ఒక గొర్రెననే అర్థం వచ్చేలా డైరెక్టర్‌ తెరకెక్కించి ప్రేక్షకుల కంటనీరు తెప్పించారు. ఇక సెకండాఫ్‌ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్షే. నిడివి ఎక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్‌. కానీ కొంతసమయం వరకు బోర్‌ కొట్టించినా.. హీరో పడే బాధల్ని చూస్తే.. ఒక మనిషి జీవిత పోరాటం కళ్లకు కడుతుంది. చివరకు ఎలాగైనా తప్పించుకుని మళ్లీ తన కుటుంబం దగ్గరకు చేరుకోవాలని హీరో ప్రయత్నించడం.. అతనికి ఇద్దరు వ్యక్తులు సాయపడడం.. చివరి ముగింపు ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా ఈ సినిమాను కమర్షియల్‌ హంగుల జోలికి వెళ్లకుండా దర్శకుడు కథ ఆధారంగానే చిత్రాన్ని తెరకెక్కించడం సాహసమనే చెప్పుకోవాలి. ఓవరాల్‌గా ఈ సినిమా ఓ అద్భుతం. ఈ సినిమా చూస్తే మాత్రం కచ్చితంగా అవార్డ్స్‌ని సొంతం చేసుకుంటదనే నమ్మకం అయితే ప్రేక్షకులకు కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే..
పృథ్వీరాజ్‌ నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. తాను తప్ప ఇంకెవరూ నటించలేరన్నట్టుగా నటించాడు. వివిధ దశల్లో ఆయన బాండీలాంగ్వేజ్‌, గొంతులో వచ్చిన మార్పును కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆయన నటన ఉంది. ఇక హీరోయిన్‌ అమలాపాల్‌ నటన బాగుంది. ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం సినిమాను మరోస్థాయికి పెంచింది. సినిమటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

➡️