స్నేహంగా.. సాయంగా …

Feb 27,2024 09:30 #feature

           ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ఉరుకుల పరుగుల జీవితమే అందరిదీ. క్షణం తీరిక ఉండదు. ఇంట్లో వాళ్లతో పట్టుమని పది నిమిషాలు మాట్లాడడమే కరువైంది. ఇక ఇరుగు పొరుగు సంగతి సరేసరి. అపార్ట్‌మెంట్ల వాసులు అయితే వారానికో, నెలకో సమావేశాల్లో మాట్లాడుకోవడమే. పక్క పక్కనే ఉంటున్నా, వారి పేర్లు కూడా చాలామందికి తెలియవు. ఈ పద్ధతి అసలు మంచిదికాదు. ఇరుగు పొరుగువారితో మంచి సంబంధాన్ని కలిగివుండడం చాలా ముఖ్యం. వారితో ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండడం వల్ల ఏ ఆపదలోనైనా సన్నిహిత వ్యక్తులున్నారన్న భరోసా ఉంటుంది. దూరంగా ఉన్న స్నేహితులు, బంధువుల కంటే పొరుగువారు ఎక్కువ ఉపయోగకరంగా, సహాయకారిగా ఉంటారు. అత్యవసర, ఆపద, సమస్యాత్మక పరిస్థితుల్లో పొరుగువారే మొదటి రక్షణ.

గౌరవంగా ఉండాలి

             ఇరుగు పొరుగు ఒకరికొకరు గౌరవంగా ఉంటేనే సంబంధాలు బలపడతాయి. పొరుగు వారికి ఇబ్బంది కలిగించే చర్యలకు అసలు పాల్పడొద్దు. ఉదాహరణకు పెద్దగా కేకలు వేయడం, మ్యూజిక్‌ సిస్టమ్‌, టీవీ సౌండ్‌ బిగ్గరగా పెంచడం, విచ్చలవిడిగా చెత్త పారేయడం వంటివి చేయకండి. వారింటికి వెళ్లినప్పుడు గంటల తరబడి విసుగొచ్చేలా మాట్లాడుతూనే ఉండకండి. అసందర్భ, అనవసర సలహాలూ ఇవ్వకండి. ఇవన్నీ వారికి అసౌకర్యంగా ఉండొచ్చు. పిల్లల్ని తీసుకెళ్లినప్పుడు, ముఖ్యంగా అల్లరి పిల్లలైతే జాగ్రత్తగా ఉండాలి. వారి షెడ్యూలు తెలుసుకొని ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకోవాలి.

వేడుకలకు ఆహ్వానించండి

             పుట్టినరోజులు, పండగలు, ప్రత్యేక సంప్రదాయాలు, ఇతర కుటుంబ సందర్భాల్లో పొరుగువారిని తప్పక ఆహ్వానించండి. ఇలాంటి సమయాల్లో పొరుగువారితో మీకూ, పిల్లలకూ, బంధువులకూ మంచి కమ్యునికేషన్‌ ఏర్పడుతుంది. మంచి సంభాషణలు జరుగుతాయి. మీ ఇంట్లో జరగబోయే ఫంక్షన్‌ ముందస్తు ఏర్పాట్లలోనూ వారి సాయాన్ని తీసుకోండి. పిండివంటలు, పచ్చళ్లు పెట్టే సందర్భాల్లోనూ పిలిచి, వారి సాయం, సలహాలు తీసుకోవచ్చు.

పరస్పర సహకారం

             పక్కింటి వారు ఊరెళ్లినప్పుడు మొక్కలకు నీళ్లు పోయడం, వారి పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం, బయటకు వెళ్లి రావడం ఆలస్యమైతే వారి పిల్లలకు ఏవైనా టిఫిన్‌, స్నాక్స్‌ ఇవ్వడం, పేరెంట్స్‌ వచ్చే వరకు మీ పిల్లలతో పాటు చదివించడం, ఆడించడం చేయొచ్చు. వృద్ధులుంటే వారిని తరచూ పలకరించడం, వారి అవసరాలు తెలుసుకోవడం చేయాలి. ఎంత అవసరంలో ఉన్నా కొంతమంది ఎదుటివారి సహాయం అడగానికి మొహమాటపడతారు. వారి ఇబ్బందులను గ్రహించి మీరే చనువు తీసుకోవచ్చు. ఆస్పత్రి, బ్యాంకు, సరుకులు, బట్టలు వంటి ఇతర అవసరాల్లోనూ పరస్పర సహకారం మంచిది. అయితే ఎందులోనూ అతి చూపకండి.

నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

                పొరుగు వారి వద్ద ఏదైనా అప్పు తీసుకుంటే నిర్ణీత సమయంలో తిరిగివ్వాలని గుర్తుంచుకోవాలి. డబ్బుల విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి. తీసుకున్న వస్తువులను మీ అవసరం తీరాక వెంటనే ఇచ్చేయాలి. పొరపాటున వారి వస్తువులను పాడుచేస్తే బాగు చేసి ఇవ్వాలి. లేదా కొత్తవి తెచ్చివ్వాలి.

అభిప్రాయబేధాలొచ్చినప్పుడు

                 పొరుగువారితో ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాలి. ఆ విషయాన్ని తరచూ ఇతరులతో చెప్పడం వల్ల వారికి మీపట్ల ఉండే గౌరవం పూర్తిగా పోతుంది. చిన్న చిన్న సమస్యలనూ కంప్లెయింట్‌ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లకూడదు. సమస్య ఏదైనా ముందుగా వారితో సామరస్యంగా మాట్లాడండి. ఇతరుల చెప్పుడు మాటలు నమ్మి వారి పట్ల మీకుండే అభిప్రాయాన్ని మార్చుకోకండి. సహృదయంతో ఉండడానికి ప్రయత్నించండి. వారు ఎదురుపడితే సింపుల్‌గా హారు చెప్పడం, చిరునవ్వు నవ్వడం చేస్తూ వుంటే మళ్లీ సంబంధాలు బలపడతాయి.

సరదాగా కబుర్లు

               అందరూ మంచి పొరుగువారినే కోరుకుంటారు. అందుకే ఖాళీ సమయాల్లో కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకోవాలి. మంచీచెడూ మాట్లాడుకోవాలి. అలవాట్లు, అభిరుచులు పంచుకోవాలి. వ్యక్తిగత సమస్యలనూ పంచుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. పిల్లలు, పెద్దలతో కలిసి ఇరు కుటుంబాలు పార్కులు, సినిమాలకు వెళ్లొచ్చు. పిక్‌నిక్‌లు, టూర్లు, సెలవుల్లో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు ప్లాన్‌ చేసుకోవచ్చు.

పరిచయం

               కొత్త పరిసరాలకు మారినప్పుడు లేదా మీ పక్కింట్లోకి కొత్తవారు వచ్చినప్పుడు ముందుగా వారిని పరిచయం చేసుకోవడం బలమైన బంధం ఏర్పడడానికి మొదటి అడుగు అవుతుంది. ఆ సమయంలో వారికి ఏదైనా బహుమతి లేదా ఏదైనా మీరు చేసిన వంటకం ఇస్తూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు. ఇల్లు సర్దుకునే సమయంలో కాఫీ, టీ వంటివి తీసుకెళ్లి ఇవ్వొచ్చు. పరస్పర వివరాలను షేర్‌ చేసుకోవచ్చు. పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను పరిచయం చేయొచ్చు. పొరుగువారు ఆ ప్రాంతానికి కొత్తవారైతే, ఊరి ప్రత్యేకతను వివరించొచ్చు.

ఆత్మీయులుగా …

             వారికి ఏవైనా సమస్యలున్నప్పుడు తప్పక సహాయం అందించాలి. అనారోగ్యంతో ఉంటే మన వీలును బట్టి టిఫిన్లు, భోజనం ఇవ్వాలి. గెస్టులు వచ్చినప్పుడు, ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వారికి వంటలో సాయం చేయొచ్చు. వారికి వీలు కానప్పుడు, సమయానికి అందుబాటులో లేనప్పుడు వారి పిల్లలను డ్రాపింగ్‌, పికపింగ్‌ చేసుకోవచ్చు. ఇలాంటి చర్యలు పొరుగువారిని మీకు మరింత దగ్గర చేస్తాయి.

➡️