పులి తిరిగే అడవిలో పూట గడవని బతుకులు

Apr 17,2024 05:30 #feachers, #jeevana, #Tiger, #village

పూట గడవడం కోసం, పిల్లలకు రెండు పూటలా తిండి పెట్టడం కోసం ఎంతోమంది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ పనిచేసే వారూ ఉంటారు. సాధారణంగా అలాంటి ప్రమాదకర పనుల్లో పురుషులే ముందుంటారని చాలామంది భావిస్తారు. కానీ, ఉత్తరాఖండ్‌ నైనితాల్‌ పర్వతశ్రేణిని ఆనుకుని ఉన్న భిమ్‌తాల్‌ బ్లాక్‌లోని ఓ గ్రామంలోని మహిళలు ఆ పనుల్లో ముందుంటూ ప్రతి రోజూ ప్రాణాలతో పోరాడుతున్నారు. కట్టెల కోసం అడవికి వెళ్లిన వారు, పులుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం అక్కడ సర్వ సాధారణం. వెళ్లినవారు తిరిగి వస్తారన్న నమ్మకం ఉండదు. అయినా వారికి మరో దారి లేదు. అప్పటివరకు తమతో తిరిగిన మహిళ దారుణంగా చంపబడినా, మరుసటి రోజు మళ్లీ అడవికి వెళ్లాల్సిందే. వేరే గత్యంతరం లేదు. అయితే ఈ పరిస్థితికి కారణం పులులే అంటే ఒప్పుకోవడం లేదు పరిశోధకులు. దీనంతటికీ వాతావరణ మార్పులే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.

గతేడాది డిసెంబరు 19న గ్రామం నుంచి కొంతమంది మహిళలు కట్టెల కోసం అడవికి వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా వారికి కావాల్సిన ఎండు కట్టెలు దొరకలేదు. దీంతో ఒక్కొక్కరిగా విడిపోయి వెతుకులాట ప్రారంభించారు. ఇంతలో అప్పటివరకు వారితో పాటే ఉన్న 22 ఏళ్ల నిఖితని ఓ పులి అమాంతం పొదల్లోకి లాక్కెళ్లిపోయింది. ఆ హఠాత్‌ పరిణామానికి భయపడిపోయిన ఆ మహిళలంతా అక్కడి నుంచి తలో దిక్కు పారిపోయారు. ఆ ప్రాంతం నిఖిత ఉంటున్న గ్రామానికి అర కిలోమీటరు దూరంలో ఉంది. ఓ మహిళ పరుగు పరుగున నిఖిత ఇంటికి వచ్చి ఈ విషయాన్ని ఆమె తండ్రి విపిన్‌చంద్‌ శర్మకి తెలియజేసింది. లబోదిబో మంటూ విపిన్‌ అటువైపు పరుగులంకించుకున్నాడు. అయితే కూతురును కాపాడుకోవాలన్న అతని తనప ఫలించలేదు. అప్పటికే పులి దాడిలో నిఖిత ప్రాణాలు కోల్పోయింది. రక్తం మడుగులో తడిసిన నిఖిత మృత శరీరాన్ని ఆ తండ్రే తన భుజాలపై మోసుకుని గ్రామానికి తీసుకొచ్చాడు. ఏ తండ్రికీ ఇంతటి కష్టం రాకూడదని ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.


ఆ గ్రామంలోని గ్రామస్తులంతా వ్యవసాయం తరువాత పశుపోషణ మీదే ఎక్కువ ఆధారపడతారు. ఉపాధి కోసం పురుషులు వేరే ఊళ్లకి తరలిపోతే, ఇంటిడి చాకిరి ఇల్లాళ్లే చూసుకుంటారు. కొన్ని కుటుంబాల్లో పొలం పనుల్లో పురుషులు నిమగమై ఉంటే, ఆ ఇంటి మహిళలే అడవులకు వెళతారు. ‘వ్యవసాయానికి కావాల్సిన ఎరువుల కోసం, పశుగ్రాసం కోసం, వంట చెరకు కోసం మేము అడవికి వెళ్లాల్సిందే. ఈ ప్రయాణంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటాలి. ఒకప్పుడైతే కొంతదూరం వెళ్లేసరికే కావాల్సినవి దొరికేవి. కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల పచ్చని మొక్కలు కనపడడం లేదు. వన్యప్రాణుల భయం ఉన్నా తప్పక అడవి మధ్యలోకి వెళ్లాల్సి వస్తోంది. ఎప్పుడు పులులకు బలవుతామేమోనని చాలా భయపడతాం. కానీ తప్పడం లేదు’ అని ఎంతో ఆవేదనగా చెబుతోంది హేమా జోషి.

‘అడవంతా ఎండిపోయింది. ఎక్కడా పచ్చని చెట్టు కనిపించడం లేదు. నిఖిత మరణం పది రోజుల వ్యవధిలో మూడవది. గతేడాది మొత్తం మీద ఐదుగురు మహిళలు చనిపోతే ఈ ఏడాది ప్రారంభంలోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయని’ హేమ భావోద్వేగ స్వరంతో చెబుతున్నారు.
‘వాతావరణంలో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఈ ప్రభావంతోనే అడవుల్లో వృక్ష సంపద తరిగిపోతోంది. ఫలితంగా ఈ మహిళలు అడవిలో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారు. పులులున్నాయనే హెచ్చరికలు జారీ చేసినా, ఆంక్షలు పెట్టినా బతుకుదెరువు కోసం తప్పక వెళుతున్నారు. వాతావరణంలో మార్పులు, పేదరికం వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది’ అంటున్నారు ఎర్త్‌ సైన్స్‌ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ డైరెక్టర్‌ సురుచి భద్వాల్‌.


‘నిఖిత మరణం తరువాత, అటవీశాఖ మమ్మల్ని అడవిలోకి వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. పశువుల మేతను డెయిరీ ఫారమ్స్‌ ద్వారా అందిస్తామని చెప్పారు. మేము అది నిజమే అని నమ్మాం. కానీ డెయిరీ ఫారం మా బకాయి సొమ్ముకు బదులుగానే గడ్డిని సరఫరా చేసింది. మేతని కొని పశువులను పెంచుకునే స్థోమత మాకు లేదు. అందుకనే మళ్లీ మళ్లీ అడవిలోకే వెళుతున్నాం’ అంటూ కూతురుపోయిన దు:ఖాన్ని దిగమింగుకుంటూ విపిన్‌ చంద్‌ చెబుతున్నాడు.
‘ప్రతి నెలా గ్యాస్‌ సిలిండర్‌ కొనుక్కుని వంట చేసుకునే ఆర్థిక స్థోమత మాకు లేదు. ఎరువులు కొని పంట పండించుకునే స్థితిలో కూడా లేం. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇల్లు ఎలా నడపగలం? అడవి ఒక్కటే మమ్మల్ని ఆదరిస్తుంది. అందుకే క్రూర జంతువులు ఉంటాయనితెలిసినా అడవి మధ్యలోకి వెళుతున్నాం’ అని చెబుతోంది 54 ఏళ్ల లీలా భట్‌.
‘ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి పశుపోషణలో వేడి నీళ్లనే ఉపయోగిస్తాం. వంట చెరకుకు కూడా కలప అవసరమౌతుంది. మా ఉనికి, ఉపాధి అంతా అడవిలోనే ఉంది. అందుకే ప్రాణాలకు ప్రమాదముందని తెలిసినా వెళుతున్నాం’ అని చెబుతోంది లీల.
కట్టెల కోసం అడవికి వెళుతున్న ఈ మహిళల మాదిరిగానే ఎంతోమంది మహిళలు చాలీచాలని జీతాల కోసం ప్రాణాపాయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. మండుటెండలో, జోరువానలో, గజగజ వణికే చలిలో ప్రకృతి ప్రకోపాలకు తలొగ్గకుండా పనిచేసే ఎంతోమంది మహిళలు నిత్యం తారసపడతారు. భగభగ మండే కొలిమిల దగ్గర, చేతులు, కాళ్లు బొబ్బలెక్కే వాతావరణంలో కూడా పనిచేస్తారు చాలామంది. అనారోగ్యంతో కుదేలౌతున్నా, ఒక్కరోజు పని ఆపితే జీతం రాదని, బాధనంతా పంటి బిగువున భరించి, పనిచేస్తారు ఎంతోమంది. ఇలా ప్రతి రోజూ జీవన్మరణ సమస్యలతో పోరాడుతూ అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామిక మహిళలందరికీ ఈ బాధలు తీరేదెన్నడో.. !

➡️