ఆ నదిని తిరిగి బతికించారు …

Apr 26,2024 04:05 #Jeevana Stories

విశ్రాంత ఉద్యోగులుగా మారిపోయిన తరువాత తీరిక సమయాన్ని చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవించేయాలని ప్రణాళికలు వేసుకుంటారు చాలామంది. అయితే మహారాష్ట్ర సోలాపూర్‌ జిల్లాకి చెందిన 77 ఏళ్ల వైజినాథ్‌ ఘోంగడే అందుకు భిన్నంగా ఆలోచించారు. అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి రిటైర్‌ అయిన ఆయన, అధికారికంగా తనకు వచ్చే పెన్షన్‌ డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ‘ఈ డబ్బులు తీసుకోవడానికి నేను నిజంగా అర్హుడినేనా?’ అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. ‘తన ప్రాంతంలోని జీవనది తన కళ్ల ముందే ఎండిపోతుంటే ఏమీ చేయకుండా డిపార్ట్‌మెంట్‌ ఇచ్చే పెన్షన్‌ డబ్బులు ఎలా తీసుకోవాలి?’ అని తెగ మధన పడిపోయారు. ఇంకొంతమందితో కలిసి ఆ నదిని తిరిగి బతికించారు ఆయన.

‘నేను అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి రిటైర్‌ అయ్యాను. పదవీ కాలమంతా జీతం తీసుకున్నాను. రిటైర్‌ అయ్యాక కూడా పెన్షన్‌ డబ్బులు వస్తున్నాయి. మరి నేను తీసుకుంటున్నదానికి న్యాయం చేశానా? డిపార్ట్‌మెంట్‌కి ఏదైనా తిరిగి ఇచ్చానా?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు మా ప్రాంతంలో ‘మన్‌ గంగ’ నది పరిస్థితి నా కళ్లముందు ప్రత్యక్షమైంది. నదిలోని నీరంతా కలుషితమైపోయింది. చెత్తచెదారం పేరుకుపోయి వర్షాలు పడినప్పుడల్లా వరదలతో ఊళ్లు మునిగిపోతున్నాయి. నీటి పారుదల లేక వ్యవసాయం లేదు. ఫలితంగా నదిని ఆనుకుని ఉన్న గ్రామాలన్నీ కరువు పీడిత ప్రాంతాలుగా మారిపోయాయి. ఈ విషయాలన్నీ నన్ను తీవ్రంగా కలచివేశాయి. వీటన్నింటికీ పరిష్కారం చూపిస్తే గానీ, నేను తీసుకున్న జీతానికి, తీసుకుంటున్న పెన్షన్‌కి న్యాయం చేసినవాడిని కాను’ అని గట్టిగా నిర్ణయించుకున్నాను.
సంగోలా తాలుకాలోని వాడేగౌన్‌ గ్రామం మాది. నది మీద ఆధారపడి ఇక్కడ వందల మంది జీవిస్తున్నారు. ఈ నీరు పనికిరాకుండా పోతే వారి జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. అలాకాకుండా ఉండాలంటే, నది నీటిని ఉపయోగకరంగా మార్చాలి. అయితే నదిని పునరుద్ధరించడం నా ఒక్కడివల్ల అయ్యే పని కాదు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి. అంతకంటే ముందు జీవనదికి ఇంతటి దుర్భర పరిస్థితికి కారణమైన అంశాలపై అధ్యయనం చేయాలి. ఇలా నా మనసులో అనేక ఆలోచనలు సుడిగుండాల్లా తిరిగేవి’ అంటూ గతం తాలూకు జ్ఞాపకాలను ఘోంగడే గుర్తు చేసుకున్నారు.
‘నదిని తిరిగి తీసుకురావాలి’ అని ప్రతి రైతు కల కంటాడు. సతారా జిల్లా తూర్పు కనుమల్లో పుట్టిన ‘మన్‌ గంగా’ పరివాహక ప్రాంతాల్లో ఐదు కరువు ప్రాంతాలున్నాయి. దహివాది, అట్‌పాది, సంగోలా, మంగళ్‌వేదా, పంధర్‌పూర్‌ గుండా ప్రవహించిన మన్‌ గంగా, భీమా నదిలో కలుస్తుంది. ఈ కరువు ప్రాంతాల్లో వర్షాకాలంలో వరదలు కూడా వస్తాయి. నది మొత్తం చెత్తా, చెదారం నిండిపోవడం వల్ల వర్షపు నీరు పల్లానికి ప్రవహించే వీలు లేక ఊళ్లు మునిగిపోతున్నాయి. నదీ తీర ప్రాంతంలో కోతకు కారణమయ్యే వృక్షజాతి విస్తృతంగా పెరిగిపోతోందని నా అధ్యయనంలో వెలుగు చూసింది.
నదీ పరివాహక ప్రాంతాన్ని అధ్యయనం చేసేందుకు 2011లో ఘోంగడేతో పాటు మరికొంత మంది వ్యక్తుల బృందం బయలుదేరింది. ‘నా ప్రయాణంలో ఇరిగేషన్‌ నిపుణుడు, హార్టికల్చర్‌ నిపుణుడు, విద్యావేత్త, అధ్యయనకర్త, మాజీ సైనికాధికారి, ఓ రైతు సభ్యులయ్యారు. మేమంతా 165 కిలోమీటర్లు విస్తరించిన నదిని, 4763 చదరపు కి.మీ విస్తరించిన నీటి పరివాహక ప్రాంతాన్ని అధ్యయనం చేయాలని కాలినడకన బయలుదేరాం.
ఈ ప్రయాణంలో ఎంతోమందిని కలిశాం. నేల, నీటి నాణ్యత, నీటిపారుదల లభ్యత, రైతులు అవలంబించే పంట విధానాలు ఇలా ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు పంచాయతీ కార్యాలయాల్లో, ఆలయ ప్రాంగణాల్లో, స్కూళ్లల్లో, కమ్యూనిటీ హాల్స్‌లో, రైతుల ఇళ్లల్లో బస చేసేవాళ్లం.
నదీ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయకుండా వరదల ముంపు నుంచి గ్రామాలను రక్షించే వృక్షజాతిని అభివృద్ధి చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలకు పిలుపు ఇచ్చాం. 2016 నుంచి ప్రజలను కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేశాం.
‘పరిక్రమ మన్‌గంగేచీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించి, స్కూళ్లు, కాలేజీలు, గ్రంథాలయాలు, ప్రొఫెసర్లు, రైతులకు పంచిపెట్టాం. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అందరూ సానుకూలంగా స్పందించారు. మాకు మద్దతుగా నిలబడతామన్నారు. నదిపై నిర్మించిన ఆనకట్టలు కూడా నిరుపయోగంగా మారిపోయాయి. ప్రవాహం సాఫీగా సాగడం లేదు. పైగా నది అడుగున పొరలుపొరలుగా ఒండ్రు పేరుకుపోయింది. ఇది చాలదన్నట్లు తమ ఇళ్లల్లో, ఊళ్లో పేరుకుపోయిన చెత్తను గ్రామస్తులు నదిలోకే విసిరేయడం మా అధ్యయనంలో గమనించాం’ అని ఘోంగడే చెబుతున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న నీటి ప్రవాహాలను మనమెంత కలుషితం చేస్తున్నామో అనే విషయం కచ్చితంగా స్పృహలోకి వస్తుంది.
కార్యాచరణ ఒక్కటే కాదు, అందుకు దగ్గ నిధుల సేకరణ కూడా ఉండాలన్న ఆలోచనతో ఘోంగడే బృందం నిధుల సేకరణ కూడా మొదలుపెట్టింది. స్కూలు టీచర్లు, దుకాణదారులు, ఎన్‌జివోలు, పారిశ్రామికవేత్తలు, చారిటరీ సంస్థల్లో నదీ సంరక్షణ పట్ల అవగాహన కల్పించింది.

అనితర సాధ్యమైన బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు వేసిన ఘోంగడే, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ‘మన్‌ గంగా’ను పునరుద్ధరించారు. ఆగస్టు 2021న నదిపై నిర్మించిన ఆనకట్ట నుంచి నీటి ప్రవాహాన్ని విడుదల చేశారు. ఆ రోజు వందలమంది ప్రజలు ఆ దృశ్యం చూసి, ఆనందంతో కేరింతలు కొట్టారు. ‘ఈ రోజు మా జీవితాలపై మళ్లీ ఆశలు పెట్టుకున్నాం. పంటలు బాగా పండుతాయన్న కల నెరవేరింది’ అంటూ గుమిగూడిన ప్రజల నుంచి ఎందరి గొంతుకలో బిగ్గరగా అరిచాయి. ‘మేము అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. చెత్త అంతటినీ తొలగించి, నదిని వెడల్పు చేయాలి. అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్నాం. కరువులు, వరదలు మా ప్రాంతంలో ఇక రావు, భవిష్యత్తు తరాల వారు కూడా వాటిని ఎదుర్కొనకూడదంటే చేయాల్సింది ఇంకా వుంది…’ అంటున్న ఘోంగడే లాంటి విశ్రాంత అధికారి చాలా అరుదుగా కనిపిస్తారు.

➡️