గాజువాక అభివృద్ధికి సిపిఎం 1970వ దశకం నుంచీ కృషి

May 9,2024 00:40 #gazuwaka

ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి మరడాన జగ్గునాయుడు గాజువాక అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఆయన కార్మిక నాయకుడు. గాజువాక ప్రాంత ప్రజలు, స్టీల్‌ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల మద్దతు ఆయనకు ఉంది. స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఛైర్మన్‌గా జగ్గునాయుడు మూడేళ్లుగా విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గాజువాక నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపైనా ఆయన ఉద్యమించారు. ఇక కూటమి తరపున బరిలో ఉన్న టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, వైసిపి అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ మాటలు తప్ప ఉక్కు ప్రైవేటీకరణపై సరైన పోరాటం సాగించిన దాఖలాల్లేవు. గాజువాక ప్రాంతంలో 1970వ దశకం నుంచీ సిపిఎం ఆధ్వర్యాన అనేక పోరాటాలు నడిచాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం ఉద్యమాలు జరిగాయి. విజయాలూ దక్కాయి. బిహెచ్‌పివి, హిందుస్థాన్‌ జింక్‌, విశాఖ ఉక్కు కర్మాగారం, ఇలా అన్నింటా సిపిఎం నిర్వహించిన కార్మిక ఆందోళనల కృషి ఇప్పటికీ ఇక్కడ ప్రసిద్ధం. సిపిఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన జగ్గునాయుడు ఈ ప్రాంతంలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలపై 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గంగవరం పోర్టు కాలుష్యం, విశాఖ డెయిరీ కాలుష్యంతో గాజువాక ప్రాంత ప్రజలు పడుతున్న అవస్థలపై అనేక ఆందోళనలకు ఆయన నాయకత్వం వహించారు.

➡️