కూటమి కొట్లాటల్లో ధర్మవరం

Apr 29,2024 01:30 #election

రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటి
త్రిముఖ పోరు తప్పదా?

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :సత్యసాయి జిల్లాలోని ధర్మవరం అసెంబ్లి నియోజకవర్గంలో కమలం వాడిపోతుంది. అక్కడ బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు స్థానిక నాయకులు సహకారం కరువైంది. దీనికితోడు ఆయన స్థానికేతరుడు అని, నియోజకవర్గంపై అవగాహన పూర్తిగా లేదని పలువురు చర్చించుకుంటున్నారు. పట్టుకోసం ఆయన నానా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆధారపడి నెట్టుకొచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గంలో బిజెపి బలం నామమాత్రమే. 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తే వెయ్యిలోపు ఓట్లు మాత్రమే బిజెపికి ఇక్కడ వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ బిజెపి ఆ స్థానాన్ని అడగటం వెనుక టిడిపి నుంచి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే జి సూర్యనారాయణ బలం చూసే. ఆయన 2014లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లోనూ టిడిపి తరపున పోటీ చేసి ఓటమి చెందారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఆయన బిజెపిలో చేరారు. ఈసారి బిజెపి తరపున ఆయనకే టికెట్టు అని మొదట ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయన కూడా అభ్యర్థి ప్రకటనకు ముందే బిజెపి తరపున ప్రచారాన్ని ప్రారంభించారు. చివరి నిమిషంలో మార్పు జరిగి సత్యకుమార్‌కు టికెట్టు ఇచ్చారు. భంగపడిన సూర్యనారాయణ అసంతృప్తితో ఉన్నారు. ఒక దశలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే సత్యకుమార్‌కు ఆయన సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. టిడిపి తరపున టికెట్టు ఆశించిన పరిటాల శ్రీరామ్‌ మద్దతుదారులు పెద్దయెత్తున నిరసనలు సైతం చేపట్టారు. చివరకు సత్యకుమార్‌కు సహకరిస్తామని ప్రకటించారు. అప్పుడప్పుడు శ్రీరామ్‌ ప్రచారాల్లో పాల్గొంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ బిజెపికి మద్దతు నిలువడం కష్టసాధ్యమైనదిగానే ఉందని రాజకీయవర్గాల్లో చర్చ. ఎందుకంటే పరిటాల శ్రీరామ్‌ తల్లి పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా శ్రీరామ్‌ దృష్టి సారించాల్సి ఉంది. రాప్తాడులో వైసిపి అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డితో సునీతకు గట్టిపోటీనే ఎదురవుతోంది. ఇక జనసేన నాయకుడు మధుసూదన్‌రెడ్డి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మవరంలో ఏమాత్రం బలం లేని బిజెపికి పూర్తి స్థాయి సహకారం, తోడ్పాటు అందటం ఇబ్బందికరంగానే ఉండనుంది. ఇలా సొంత పార్టీ నాయకుల నుంచి.. ఇటు మిత్రపక్షం నుంచి పూర్తి స్థాయి సహకారం లేకపోవడంతో ధర్మవరంలో బిజెపికి ఎదురుగాలే వీస్తోంది. ఇక్కడ వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముందు నుంచి జనంలో ఉంటూ వస్తున్నందున ఆయన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టుంది. ఇప్పటికే ఆయన రెండు, మూడు విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. సత్యకుమార్‌ ఇప్పటికీ ఒక దశ ప్రచారం కూడా పూర్తవలేదు. నియోజకవర్గంపై అవగాహన కల్పించుకునే పనిలోనే ఉన్నారు.

➡️