హిల్‌ స్టేషన్‌లో ఉత్కంఠ

May 10,2024 23:10 #Himachal Pradesh

– రాష్ట్ర ప్రభుత్వంపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ కమలం కుట్రలు

– సంక్షోభం నుంచి బయటపడ్డ కాంగ్రెస్‌ శ్రీ హస్తానికి ఆప్‌, వామపక్షాల మద్దతు
-బిజెపిపై ప్రజా వ్యతిరేకత శ్రీ మోడీ సర్కారుపై ఆపిల్‌ రైతుల ఆగ్రహం

– మండి స్థానంపై సర్వత్రా ఆసక్తి

వేసవి రాజధాని హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొండలతో విస్తరించి పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ స్థానాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశ (జూన్‌ 1)లో ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిజెపి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బిజెపి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుండగా, కాంగ్రెస్‌ను సంక్షోభం వెంటాడుతోంది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలకు నాలుగింటినీ బిజెపి సొంతం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఆప్‌, వామపక్షాలు మద్దతిస్తున్నాయి. అయితే 2022 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో 68 స్థానాలకుగాను కాంగ్రెస్‌ 40, బిజెపి 25, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేయగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతిచ్చారు. దీంతో కాంగ్రెస్‌, బిజెపి బలం చెరి సమానం (34 ఓట్లు ) అయింది. లాటరీ తీయగా.. అందులో బిజెపికి చెందిన హర్ష్‌ మహాజన్‌ పేరు రావడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఓడిపోయారు.
బిజెపి అవిశ్వాసం కుట్రకు చెక్‌
దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బిజెపి పార్టీ రెడీ అయింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్‌ తెరదించింది. ఖాళీ అయిన ఆ ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోవైపు తమపై అనర్హతను సవాల్‌ చేస్తూ ఆ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరిగి ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుని, బిజెపిలో చేరారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలు బిజెపి తరపున పోటీ చేస్తున్నారు.
ప్రధాన అంశాలు
హిమాచల్‌ప్రదేశ్‌ లో ఆపిల్‌ రైతుల సమస్య ప్రధానమైనది. ఆపిల్‌ కు మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. అగ్నిపథ్‌ పథకంపైన కూడా యువకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య చర్చనీయాంశంగా ఉంది.

మండిలో ‘కింగ్‌’ వర్సెస్‌ ‘రీల్‌ క్వీన్‌’
మండి లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు నెలకొంది. ‘కింగ్‌’ వర్సెస్‌ ‘రీల్‌ క్వీన్‌’ తలపడుతున్నారు. బిజెపి తరపున బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ బరిలో ఉండగా, కాంగ్రెస్‌ నుంచి రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్‌ను బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం విక్రమాదిత్య సింగ్‌ హిమాచల్‌ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, హిమాచల్‌ పిసిసి అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌ దంపతుల తనయుడైన విక్రమాదిత్య ఇప్పటికే రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి మండిలో యువనేతనే రంగంలో దించాలని సీనియర్‌ నేతలు భావించడం వల్ల ఆయన పేరు ఖరారైంది. ఇప్పటివరకు మండి నియోజకవర్గంలో రాజకుటుంబాలదే హవా. 1952 నుంచి రెండు ఉపఎన్నికలు సహా మొత్తం 19 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 13 సార్లు రాజకుటుంబాలకు చెందినవారే గెలుపొందారు. సిమ్లా రూరల్‌ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విక్రమాదిత్యకు మండి లోక్‌సభ నియోజకవర్గం కొత్తేమీ కాదు. విక్రమాదిత్య సింగ్‌ తండ్రి వీరభద్రసింగ్‌, ప్రతిభాసింగ్‌ ఇక్కడి నుంచి ఒక్కొక్కరు మూడు సార్లు గెలుపొందారు. 2021లో మండి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో తన తల్లి ప్రతిభా సింగ్‌ గెలుపు కోసం విక్రమాదిత్య విస్త్రుతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులతో విక్రమాదిత్యకు మంచి సంబంధాలు ఉన్నాయి. హిమాచల్‌ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్‌ నేత జైరాం ఠాకూర్‌కు మండిలో మంచి పట్టు ఉండడం, ఈ నియోజకవర్గ పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ బిజెపి కైవసం చేసుకోవడం కంగనాకు కలిసివస్తుందని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు.

జె.జగదీష్‌

➡️