హస్తిన పోరు హాట్‌హాట్‌-కేజ్రీవాల్‌ అరెస్టుతో వేబెక్కిన రాజకీయాలు

Apr 28,2024 23:02

-ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య సీట్ల అవగాహన
-గతానికి భిన్నంగా ఢిల్లీలోద్విముఖ పోటీ
– బెడిసికొట్టిన బిజెపికక్ష సాధింపు చర్యలు
-2019 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు అసాధ్యం
ప్రజాశక్తి- న్యూఢిల్లీ ప్రతినిధి :దేశ రాజధాని ఢిల్లీ జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువు. జాతీయ పార్టీలతోపాటు స్థానిక ప్రాంతీయ పార్టీలు సైతం ఇక్కడ పట్టు సాధించాయి. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఆరో విడత మే 25న ఎన్నికలు జరగనున్నాయి. మద్యం కుంభకోణం ఆరోపణలపై ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇ.డి. అరెస్ట్‌ చేసి జైలులో పెట్టింది. మోడీ సర్కారు రాజకీయ కక్షతో కేజ్రీవాల్‌ను సరిగా లోక్‌సభ ఎన్నికల ముందు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేయించిందని ఆప్‌తో పాటు ఇండియా బ్లాక్‌ పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ సిఎం హేమంత్‌ సోరెన్‌ అక్రమ అరెస్టులకు నిరసనగా ఇటీవల ఇండియా బ్లాక్‌ పార్టీలు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. మరోవైపు ఆప్‌ ఆందోళనలకు దిగింది. ఈ పరిణామాలతో మే 25న ఎన్నికలున్నప్పటికీ ముందుగానే ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ ఆప్‌ అభ్యర్ధుల గెలుపు కోసం శనివారం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈస్ట్‌ ఢిల్లీలోని కళ్యాణ్‌పురిలో రోడ్‌షో నిర్వహించడంతో ఒక్కసారిగా హస్తినలో ఎన్నికల కాక రెట్టింపైంది. కాగా ఇక్కడ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజాక్షేత్రంలో లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టిన తరువాత రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. బిజెపికి ఎదురుగాలి వీస్తోంది. ఇండియా ఫోరంలో భాగంగా కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. బిజెపి ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇక్కడ ద్విముఖ పోరు నెలకొంది. గత రెండు ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలను గెలిచిన బిజెపి, మూడోసారి కూడా క్లీన్‌ స్వీప్‌ చేయడానికి బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతుండగగా, మరోవైపు బిజెపికి అడ్డుకట్ట వేసి ఏడింటిలోనూ విజయకేతనం ఎగురువేయాలని ఇండియా ఫోరం గట్టిగా పయత్నిస్తుంది.

ఐదుగురు బిజెపి అభ్యర్ధులు ఖరారు
ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేయనుంది. ఐదుగురి పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్‌, చాందినీ చౌక్‌ నుంచి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌, దక్షిణ ఢిల్లీ నుంచి రాంవీర్‌ సింగ్‌ బిధూరి, ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్‌ తివారీ, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్‌ జిత్‌ సెహ్రావత్‌, తూర్పు ఢిల్లీ నుంచి హర్ష్‌ మల్హోత్రా, వాయువ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియాలను బిజెపి పోటీకి దింపింది. కాగా బిజెపి పలువురు సిట్టింగ్‌లను తొలగించింది. ఏడుగురు ఎంపిల్లో ఆరుగురుకి టిక్కెట్లు నిరాకరించింది. ఒక్క సిట్టింగ్‌ ఎంపిక మనోజ్‌ తివారీకి మాత్రమే మరోసారి టికెట్‌ దక్కింది. తూర్పు ఢిల్లీ ఎంపి గౌతమ్‌ గంభీర్‌, నార్త్‌ వెస్ట్‌ ఎంపి హన్స్‌ రాజ్‌ హన్స్‌, మాజీ మంత్రి, చాందినీ చౌక్‌ ఎంపి హర్షవర్ధన్‌, కేంద్ర మంత్రి, న్యూఢిల్లీ ఎంపి మీనాక్షి లేఖి, వెస్ట్‌ ఢిల్లీ ఎంపి ప్రవేశ్‌ సాహిబ్‌ సింగ్‌, సౌత్‌ ఢిల్లీ ఎంపి రమేష్‌ బిధూరిలకు ఈసారి బిజెపి టిక్కెట్లు నిరాకరించింది.
ఎల్‌జి ఆధిపత్యంపైనే…
ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జి) అజమాయిషీ చెలాయించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రతి చిన్న అంశంలో ఎల్‌జి జోక్యం సమాఖ్య సూత్రాలకే నష్టం చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో కూడా ఎల్‌జి జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్‌జి నామినేట్‌ చేసిన కౌన్సిలర్స్‌ ను సుప్రీం తొలగించింది. ఇలా సుప్రీంకోర్టు అక్షింతలు వేసే ఘటనలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై ఎల్‌జికి నిర్ణయాత్మక అధికారం కట్టబెడుతూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద చట్టం ఎన్నికల ప్రచారంలో ఇండియా ఫోరంకు అస్త్రంగా మారింది.

గత ప్రాభవం బిజెపికి అసాధ్యం
ఢిల్లీలో న్యూఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, చాందినీ చౌక్‌, దక్షిణ ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లనూ బిజెపి గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బిజెపి 56.6 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ 22.5 శాతం, ఆప్‌ 18.1 శాతం, బిఎస్పి 1.1 శాతం ఓట్లు పొందాయి. అంతకు ముందు 2014 లోక్‌సభ ఎన్నికలలో కూడా బిజెపి ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా ఫోరంగా రంగంలోకి దిగిన ఆప్‌, కాంగ్రెస్‌ ప్రజాదరణను చూరగొంటున్నాయి. బిజెపికి గతంలోని ఫలితాలు రావడం సాధ్యం కాదని సందేహిస్తున్న బిజెపి, ప్రతీకార చర్యలకు పాల్పడింది. సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేస్తూ అరెస్టు చేసి జైలులో పెట్టిందని అర్థమవుతోంది.

ఆప్‌, కాంగ్రెస్‌ అవగాహన
ఈ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్‌తో సీట్ల పంపకం ఒప్పందం చేసుకుంది ప్రతిపక్ష ఇండియా ఫోరంలో భాగమైన ఈ రెండు పార్టీలు దేశ రాజధానిలో 4:3 సీట్ల షేరింగ్‌ ఫార్ములాకు అంగీకరించాయి. ఇందులో ఆప్‌ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ స్థానాల్లో ఆప్‌, చాందినీ చౌక్‌, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నాయి. ఆప్‌ తూర్పు ఢిల్లీకి కుల్దీప్‌ కుమార్‌, న్యూఢిల్లీకి సోమనాథ్‌ భారతి, దక్షిణ ఢిల్లీకి సహిరామ్‌ పెహల్వాన్‌, పశ్చిమ ఢిల్లీకి మహాబల్‌ మిశ్రాను బరిలో దింపింది. కాంగ్రెస్‌ పార్టీ చాందినీ చౌక్‌ నుండి జె.పి. అగర్వాల్‌, ఈశాన్య ఢిల్లీ నుండి కన్హయ్య కుమార్‌, వాయువ్య ఢిల్లీ నుంచి ఉదిత్‌ రాజ్‌ పోటీ చేస్తున్నారు.

➡️