విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో హోరా హోరీ

May 9,2024 00:31 #Vijayawada

– పోటాపోటీగా కేశినేని
సోదరుల ప్రచారం
– ప్రజలను ఆకట్టుకుంటున్న ఇండియా వేదిక అభ్యర్థి భార్గవ్‌ ప్రచారం
ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వైసిపి తరపున కేశినేని శ్రీనివాస్‌ (నాని), టిడిపి తరపున కేశినేని శివనాథ్‌ (చిన్ని), కాంగ్రెస్‌ తరపున వల్లూరి భార్గవ్‌ బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపి కేశినేని నాని ఎన్నికల షెడ్యూల్‌కు కొద్దిరోజులు ముందు టిడిపిని వీడారు. ఆయన రెండుసార్లు వరుసగా ఆ పార్టీ తరపున ఎంపిగా ఎన్నికయ్యారు. మూడోసారి బరిలోకి దిగిన ఆయన ఈసారి వైసిపి తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకు టికెట్‌ నిరాకరించిన టిడిపి… కేశినేని చిన్నిని రంగంలోకి దింపింది. ఆయన నానికి స్వయాన సోదరుడే. సిపిఎం, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ, ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి భార్గవ్‌ పోటీలో ఉన్నారు. వీరితోపాటు బిఎస్‌పి తదితర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌, తూర్పుతోపాటు తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు.
కేశినేని ట్రస్టు ద్వారా ఉచిత వైద్య శిబిరాలు
తన సోదరుడు కేశినేని నాని పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లు టిడిపి అభ్యర్థి చిన్ని ప్రచారం చేస్తున్నారు. అధినేత చంద్రబాబు రెండుసార్లు ఎంపిగా అవకాశం ఇచ్చినా వైసిపిలోకి వెళ్లిన నానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. కేశినేని ట్రస్ట్‌ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ముస్లిం రిజర్వేషన్లపై బిజెపి నేతల వ్యాఖ్యలతో టిడిపికి నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇక్కడ టిడిపి ఎంపి అభ్యర్థి చిన్నికి క్రాస్‌ ఓటింగ్‌ నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎంపి నియోజకవర్గ పరిధిలోని విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో అభ్యర్థి విజయాన్ని ప్రభావితం చేయగలిగే సంఖ్యలోనే ముస్లిం ఓటర్లు ఉన్నారు. నందిగామ, తిరువూరు ఎస్‌సి నియోజకవర్గాల్లోని దళితుల ఓట్లూ టిడిపికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ముస్లిములు అధికంగా ఉన్న, అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బిజెపి వ్యూహాత్మకంగా సుజనా చౌదరిని అభ్యర్థిగా బరిలో నిలిపింది. స్థానికుడు కాకపోయినా ధన బలంతోనైనా నెట్టుకువచ్చేందుకు బిజెపి ఆయనను అభ్యర్థిగా పెట్టిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

వల్లూరి భార్గవ్‌ ఉధృత ప్రచారం

ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి వల్లూరి భార్గవ్‌ తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఆయన తరపున ప్రచారానికి ఎపిసిసి అధ్యక్షులు షర్మిల విజయవాడ, తిరువూరు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. వేదిక తరపున సిపిఎం, సిపిఐ రాష్ట్ర స్థాయి నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. సిపిఎం, సిపిఐ పోటీ చేస్తున్న విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి భార్గవ్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

హ్యాట్రిక్‌పై కన్ను..!
ఎంపి కేశినేని వరుసుగా మూడోసారి ఎన్నికల బరిలో నిలిచి హాట్రిక్‌ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా, రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్న కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఏడాది కాలంగా టిడిపిలో పనిచేస్తూ తన సోదరుడైన నానికి పోటీగా నిలిచి ప్రచారం సాగిస్తున్నారు. 2014, 2019 ఎంపిగా గెలిచిన తాను తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులను ఎంపి నాని ప్రచారం చేసుకుంటున్నారు. టాటా గ్రూప్‌ ట్రస్ట్‌ ద్వారా మంచినీటి ట్రాక్టర్ల ద్వారా ఫ్లోరిన్‌ ప్రభావిత మండలంగా ఉన్న ఎ.కొండూరుతోపాటు పలు గ్రామాల్లో చేసిన మంచినీటి సరఫరా, రోగులకు వైద్య సదుపాయం కల్పన వంటి సేవలను కూడా ఆయన తన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. తనను మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. టిడిపి అధినాయకత్వం తనను పలు సందర్భాల్లో అవమానాలకు గురిచేసిందని, కొందరి నాయకుల వల్ల తాను బయటకు వచ్చి వైసిపిలోకి వెళ్లాల్సి వచ్చిందని చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

➡️