మార్పు దిశగా కాశ్మీరీలు

May 8,2024 23:48 #ladakh

– దేశాన్ని ఆకర్షిస్తున్న లడఖ్‌ ఎన్నికలు
– అనంతనాగ్‌-రాజౌరీలో త్రిముఖపోటీ
– బిజెపి విద్వేష ప్రచారం
రాజ్యాంగంలోని 370 అధికరణం తొలగించి జమ్మూకాశ్మీర్‌ను జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మోడీ సర్కారు విభజించిన తదుపరి తొలి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో 2019 నుంచి కొనసాగుతున్న కేంద్రపాలన తీవ్రమైన అణచివేతకు దారితీసింది. స్వయం ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర హోదా పోయి కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుతో స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆర్టికల్‌ 35ఎతో కూడిన ప్రత్యేకహౌదాను డిమాండ్‌ చేస్తూ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి), జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి), సిపిఐ(ఎం) ఇతర ప్రధాన కాశ్మీరీ రాజకీయ పార్టీలు కలసి పీపుల్స్‌ అలయన్స్‌గా ఏర్పడి స్థానిక సమస్యలపై పోరాడుతున్నాయి. కానీ లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల విడిగా తలపడుతున్నాయి.
అంతర్జాతీయ సరిహద్దు
విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం లడఖ్‌. కార్గిల్‌లో ముస్లింల, లేV్‌ాలో భౌద్ధులు మెజారిటీ ఓటర్లుగా ఉన్నారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో మూడు చోట్ల, లడఖ్‌ ఒక సీటుకు కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టాయి. లడఖ్‌లో భౌద్ధమతానికి చెందిన త్సెరింగ్‌ నమ్‌గ్యాల్‌ను కాంగ్రెస్‌ నుంచి బరిలో దించడంతో ఇండియా బ్లాక్‌లో అంతర్గతంగా మనస్పర్ధలు పొడసూపాయి. ముస్లిం మెజారిటీ ఉన్న కార్గిల్‌కు చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు హాజీ అస్గర్‌ అలీ కర్బాలియా, ఎన్‌సి ఖమార్‌ అలీ డిమాండ్‌ చేశారు. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వేదిక భాగస్వామ్యులతో చర్చించి ఒకతాటి మీదికి కాంగ్రెస్‌ తీసుకురాలేకపోయింది. కార్గిల్‌లోని కాంగ్రెస్‌ యూనిట్‌ షియా ముస్లిం హాజీ హనీఫా జాన్‌, కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (కెడిఎ) నుంచి సజ్జద్‌ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక బిజెపి తమ అభ్యర్ధిగా తషి గ్యాల్‌సన్‌ను నిలబెట్టింది. 2019లో బిజెపి తరుఫున త్సెరింగ్‌ నమ్‌గ్యాల్‌ గెలుపొందారు. ఈసారి ఆయన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2023లో జరిగిన లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఎన్‌సి, కాంగ్రెస్‌ కలిసి పాల్గొన్నాయి. ఈ కూటమి 26 స్థానాల్లో 19 గెలుపొందగా, బిజెపి రెండు, ఇతరులు 5 గెలుచుకున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్‌ కోసం 57 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిర్వహిస్తున్న శాంతియుత ఆందోళన ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. లడఖ్‌లో మొత్తం 1,82,571 మంది ఓటర్లు ఉన్నారు. 91,703 మంది పురుషులు మరియు 90,867 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మే 20న పోలింగ్‌ జరగనుంది.
కమలం సోషల్‌ ఇంజనీరింగ్‌
బిజెపి వ్యూహాల్లో భాగంగా రజౌరీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పహారీ గిరిజనులను ఎస్‌సి జాబితాలో చేర్చింది. అగ్రవర్ణ కులాల్లో వెనకబడిన వారికి ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీలిచ్చింది. బరిలో లేకపోయినా జాఫర్‌ మహ్నస్‌కు మద్దతిస్తోంది. మే7న జరగాల్సిన ఈ ఎన్నిక మే 25 కి వాయిదా పడటంతో బిజెపి తనకు అనుకూలంగా పావులు కదుపుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

అనంతనాగ్‌లో ముఫ్తీకి గిరిజన ఓటు బ్యాంక్‌
అనంతనాగ్‌ – రజౌరీలో త్రిముఖ పోటీ నెలకొంది. పీపుల్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) అభ్యర్థి మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) అభ్యర్థి అల్తాఫ్‌, జమ్మూకాశ్మీర్‌ అపనీ పార్టీ నుంచి జాఫర్‌ మహ్నస్‌ బరిలో ఉన్నారు. ఓటమి భయంతో ఈ స్థానంలో బిజెపి అభ్యర్థిని నిలబెట్టకపోయినా అపనీ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2019 ఆగస్టులో పిడిపి, ఎన్‌సిలు గుప్కర్‌ కూటమిగా ఏర్పడి జమ్మూకాశ్మీర్‌ పునరుద్ధరణ, ప్రత్యేకహౌదా కోసం కలిసి పనిచేశాయి. ఈ ఎన్నికల్లో విడిగా తలపడుతున్నాయి. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేకహౌదా, సహజవనరుల కార్పొరేటీకరణ వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించాయి. అనంతనాగ్‌ తన సొంత నియోజకవర్గం కావడంతో గెలుపుపై ముఫ్తీ దృష్టి సారించింది. 2018లో గుజ్జార్‌ బాలిక అత్యాచారానికి వ్యతిరేకంగా, 2019లో అటవీ భూముల నుంచి గుజ్జర్లను, బకర్వాల్‌లను ఖాళీ చేయించడానికి వ్యతిరేకంగా ముఫ్తీ చేపట్టిన నిరసన కార్యక్రమాల వల్ల ఆమెకు గిరిజన ఓటు బ్యాంకు పెరిగింది. ఈ సీటు గెలుపు ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడనుండటంతో ఎన్‌సి కూడా విజయం కోసం పోరాడుతోంది. పిడిపి నుంచి దక్షిణకాశ్మీర్‌ నాయకులను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది.

ఎలక్షన్‌ డెస్క్‌

➡️