గాజువాకలో ముక్కోణం

May 9,2024 01:31 #gazuwaka

– స్టీల్‌ప్లాంట్‌కు ప్రధాన పార్టీలు ద్రోహం
– ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి, టిడిపి ‘పరిరక్షణ’ మాటలు
-కార్మిక, ప్రజాదరణ పొందుతున్న సిపిఎం
ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :రాష్ట్రంలో అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థలకు నెలవుగా ఉన్న విశాఖలోని ఈ ప్రాంతంపై ఎన్నికల సమయంలో అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొంది. వైసిపి, టిడిపి, సిపిఎం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడి, లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ గాజువాక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను 100 శాతం అమ్మకానికి పెట్టిన కేంద్రంలోని బిజెపిపై పోట్లాడకుండా 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో ఎత్తులు వేస్తున్నాయి. ఒకరినొకరు నిందించుకుంటూ గడుపుతున్నాయి తప్ప గాజువాక అభివృద్ధికి సరైన ప్రణాళికను వెల్లడించడం లేదు. నిన్న, మొన్నటి వరకూ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ అజెండాను కూడా వైసిపి, టిడిపిలు పక్కనబెట్టేశాయి. ఎలాగూ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడింది కావున స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తామూ కృషి చేస్తామని ఆ పార్టీలు మాయమాటలు చెబుతున్నాయి. ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడినప్పటి నుంచీ మోడీ సర్కారుపై పోరాడని ఆ పార్టీలు నేడిలా ఉత్తుత్తి మాటలు చెప్పడాన్ని ఇక్కడి కార్మికవర్గం, ప్రజానీకం నమ్మడం లేదు.
3.22 లక్షల మంది ఓటర్లు
గాజువాక అసెంబ్లీ పరిధిలో 3.22 లక్షల మంది ఓటర్లున్నారు. ఈసారి ఈ నియోజకవర్గంలో స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కీలకంగా మారనున్నారు. చిన్నా, చితక ప్రైవేట్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు, అసంఘటితరంగ కార్మికులూ ఇక్కడ కీలకపాత్ర పోషించనున్నారు. గత పదేళ్లలో పాలకుల తీరుతో వీరితోపాటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయ ప్రభావం గాజువాకలోని చిన్నా, చితకా పరిశ్రమలపై పడింది. ఆటోనగర్‌లో ఇప్పటికే పలు పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రైవేటీకరణ కత్తి ప్లాంట్‌పై వేలాడుతూనే ఉన్నా 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు స్టీల్‌ప్లాంట్‌ను తాము కాపాడతామంటే తాము కాపాడతామంటూ ఎన్‌డిఎ కూటమిలోని టిడిపి, రాష్ట్రంలోని అధికార పార్టీ వైసిపి నమ్మబలుకుతున్నాయి. గడిచిన మూడున్నరేళ్లుగా సిపిఎం, వామపక్షాలు, ఇండియా వేదికలోని కాంగ్రెస్‌ ఆధ్వర్యాన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం పోరాటాలు నిరంతరం సాగుతున్నాయి. వీరి వెంటే కార్మికవర్గం ఈ ఎన్నికల్లో నడిచే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

visakha-steel-plant manganese mines
visakha-steel-plant manganese mines

అదానీ గంగవరం పోర్టు ద్రోహంపై నోరుమెదపని ప్రధాన పార్టీలు

అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను నష్టపరిచి కేంద్రం అడుగులకు మడుగులొత్తుతూ ఉక్కును వశపరచుకునేందుకు సుమారు నెల రోజులుగా మూడున్నర లక్షల టన్నుల కోల్‌, లైమ్‌స్టోన్‌ను పోర్టు నుంచి కదలనివ్వడం లేదు. దీంతో ప్లాంట్‌ ఉత్పత్తికి తీవ్రస్థాయిలో గండిపడింది. పోర్టులో కార్మికుల వేతనాలు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్‌ 10 నుంచి సమ్మెలో ఉండడంతో దీన్ని సాకుగా అదానీ యాజమాన్యం చూపిస్తూ బొగ్గు సరఫరాను ఆపేసింది. హైకోర్టు ఆదేశాలను సైతం అదానీ యాజమాన్యం లెక్కచేయలేదు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న ఈ కోల్‌ను ప్లాంట్‌కు సరఫరా కాకుండా అదానీ పోర్టు ఆడుతున్న నాటకంపై గాజువాక బరిలో ఉన్న సిపిఎం మాత్రమే పోరాడుతోంది. వైసిపి, టిడిపి అభ్యర్థులు అదానీ పోర్టు వ్యవహారంపై మాట్లాడకపోవడం పట్ల గాజువాక ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️