ఒడిశాలో నువ్వా నేనా ?

May 8,2024 23:10 #odisa

-బిజెడిపై ప్రభుత్వ వ్యతిరేకత
– భాషా, భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిజెపి

ఒడిశాలో మొదటి దశ పోలింగ్‌ ఈనెల 13న జరుగనుండడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఉన్న 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగుతున్న విషయం విదితమే. బిజెడి, బిజెపి అన్ని అసెంబ్లీ, ఎంపి స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ 145 స్థానాల్లో పోటీ చేస్తోంది. సిపిఎం, జెఎంఎం పార్టీలకు చెరో సీటును కేటాయించింది. పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ 20 స్థానాల్లో పోటీ చేసి, జగత్‌సింగ్‌పూర్‌ స్థానాన్ని సిపిఐకు కేటాయించింది. సిపిఎం ఎనిమిది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో తన అభ్యర్థులను నిలబెట్టింది. సిపిఐ పది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో పోటీ చేస్తోంది. జెఎంఎం 16 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ సెగ్మెంట్‌ బరిలో అభ్యర్థులను పోటీలో నిలిపింది. 2019 ఎన్నికల్లో బిజెడి 112 అసెంబ్లీ, 12 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. బిజెపి 23 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌ తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానం గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో అత్యధిక సీట్లలో విజయం సాధిస్తామని బిజెడి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపికి ఎన్నికల ముందు వరకు కేంద్రంలో మద్దతు ఇస్తుండడంతో, రెండు పార్టీలూ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, కార్మిక వ్యతిరేక బిల్లులకు బిజెడి మద్దతు ఇవ్వడం, ఆ పార్టీకి కొంత నష్టం తెచ్చిందన్న భావన ప్రజల్లో నెలకొంది. కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు బిజెడి ఎమ్మెల్యేలు సహకరించడమూ ఆ పార్టీకి చేటు తెస్తోంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఒక్కటైపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిజెడి ప్రభుత్వం సుమారు 25 ఏళ్లుగా అధికారంలో కొనసాగతుండడంతో, ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి 33 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చింది. ఎంపిలలో ఆరుచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చింది. నవీన్‌ పట్నాయక్‌ ఇమేజ్‌ తమను గట్టెక్కిస్తుందని బిజెడి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బిజెడి, బిజెపి
ప్రస్తుత ఎన్నికల్లో బిజెడి, బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తొలుత ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న చర్చ నడిచింది. పొత్తులు విఫలమయ్యాయని, విడివిడిగా పోటీ చేయనున్నట్లు రెండు పార్టీల నేతలు ప్రకటించారు. విడివిడిగా పోటీ చేయడం వెనుక రహస్య అజెండా దాగున్నట్లు తెలుస్తోంది. బిజెపి, బిజెడి కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు బదిలీ అయి, ఆ పార్టీ లాభపడుతుందని గుర్తించిన ఇరు పార్టీలూ కూడబలుక్కునే స్నేహపూర్వక పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

భాషా భావోద్వేగాలు రెచ్చగొడుతున్న బిజెపి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్లులకు మద్దతు ఇచ్చినప్పటికీ బిజెడిని ఓడించేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒడిశా పీఠాన్ని చేజిక్కించుకునేందుకు రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. బిజెడి ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరం అంశాన్నీ ప్రస్తావిస్తూ బిజెడిని ఇరకాటంలో పెడుతోంది. కేంద్ర మంత్రి
అమిత్‌షా గత నెల 26న సోనేపూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో బిజెడి ప్రభుత్వాన్ని దించాలంటూ పిలుపునిచ్చారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు నవీన్‌ పట్నాయక్‌ ప్రయత్నించారంటూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ సైతం నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేస్తూ 50 పేజీల ఛార్జిషీట్‌ను వెలువరించారు. ఒడియా అస్మిత (ఒడియా గర్వం), ఆత్మగౌరవం అంశం పేరుతో నవీన్‌ ప్రభుత్వంపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బిజెపి రాష్ట్ర నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒడిశా భాష, సంస్కృతిని నవీన్‌ పట్నాయక్‌ అర్థం చేసుకోవడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మచ్చకుంద్‌తో పాటు కొన్ని ఒరియా మాట్లాడే ప్రాంతాలు ఒడిశా చిత్రపటంలో గల్లంతయ్యాయని, ఒడిశా ప్రభుత్వ అధికారులు తప్పుడు ఉచ్ఛారణలతో ఒరియా భాషకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పుంజుకుంటున్న కాంగ్రెస్‌
ఈ ఎన్నికల్లో 145 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను బరిలో నిలిపింది. సిపిఎం, జెఎంఎంలకు చెరో స్థానాన్ని కేటాయించింది. సుందరఘర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని బొనై స్థానాన్ని సిపిఎంకు, బిరమిత్రపూర్‌ స్థానంలో జెఎంఎంకు మద్దతు ఇస్తోంది. గతం కంటే అధిక స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. బిజెడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు బదిలీ అవుతుందని భావిస్తోంది. పైగా బిజెడి, బిజెపి ఒక్కటేనన్న భావన ప్రజల్లోకి వెళ్లడం తమకు లాభిస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని ఐదు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలో లోపాలూ లేకపోలేదు. ఒడిశాలో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు బరిలో దిగడంతో ఆయా జిల్లాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిజెడి, బిజెపి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం, పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టడంతో కొన్నిచోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో దిగారు. ఇండియా వేదిక పార్టీలను కలుపుకుని అన్నిచోట్లా వారి సహకారం తీసుకుంటే, మెరుగైన ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తోట బీమారావు

➡️