ఓటమి భయంతో మరింతగా మత విద్వేషం : ప్రధాని మోడీ

May 8,2024 13:19 #hatred, #PM Modi, #Religious

న్యూఢిల్లీ :  సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి ముందు వరకు 400 సీట్లు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసిన ఆయన మొదటి దశ పోలింగ్‌ తర్వాత మాట మార్చారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్షాలపై దుష్ప్రచారానికి తెరతీస్తూ.. దారుణమైన విద్వేష వ్యాఖ్యలు చేశారు. దేశ సంపదను కాంగ్రెస్‌ ముస్లింలకు దోచిపెడుతుందని, మీ మంగళసూత్రాలను లాక్కుంటుందని మాట్లాడారు. మతం బూచి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. అయోధ్య రామమందిరం, ఆర్టికల్‌ 370లను ముందుకు తీసుకువచ్చారు.

తాజాగా ”కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తిరిగి ప్రవేశపెట్టకుండా, అయోధ్య రామమందిరానికి ‘బాబ్రీ తాళం’ వేయకుండా” కాంగ్రెస్‌ను నిరోధించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో తనకు 400 సీట్లు అవసరమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌, ధార్‌ జిల్లాల్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చాలని కాంగ్రెస్‌ భావిస్తోందని ఆరోపించారు. అయోధ్యలోని ఆలయానికి బాబ్రీ తాళం వేయాలని, జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకురావాలన్న ప్రణాళికలో కాంగ్రెస్‌ విజయం సాధించకూడదని చెప్పుకొచ్చారు. నిజానికిది కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో గాని, ఆపార్టీ నాయకుల ప్రసంగాల్లో గాని ఎక్కడా లేదు.

ఎన్నికల ప్రారంభానికి ముందు వరకు 400సీట్లు అంటూ పాట పాడిన ప్రధాని.. మొదటి దశ తర్వాత దళితులు, గిరిజనులు, ఒబిసిల రిజర్వేషన్లను కాంగ్రెస్‌ దోచుకోకూడదంటే 400 సీట్లను దాటాలని అన్నారు. కాంగ్రెస్‌ అబద్దాలు ప్రచారం చేస్తోందని .. 2019 నుండి 2024 వరకు ఎన్‌డిఎ ప్రభుత్వానికి పార్లమెంటులో 400 సీట్లు ఉన్నాయని తెలియదా అని అన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకువచ్చి, ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలంటే, అయోధ్యలోని రామమందిరానికి బాబ్రీ తాళం వేయకుండా ఉండాలంటే తమకు 400 సీట్లు కావాలని అన్నారు.
భారతదేశం ప్రస్తుతం చరిత్రలో కీలకమైన దశలో ఉందని, ‘ఓటు జీహాద్‌’ కావాలా లేదా ‘రామరాజ్యమా’ నిర్ణయించుకోవాలని మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు జీహాద్‌ అంటూ భారత్‌ను బెదిరిస్తున్నారని, ఇక్కడ కాంగ్రెస్‌ నిర్దిష్ట మతానికి చెందిన ప్రజలను ఏకం చేసి మోడీకి వ్యతిరేకంగా జీహాద్‌కు ఓటు వేయాలని కోరుకుంటుందని మైనారిటీలపై విషంకక్కారు.

నిరాశ, నిస్పృహలతో కాంగ్రెస్‌ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఆలోచించండి. ఓట్‌ ఫర్‌ జీహాద్‌ మీకు ఆమోదయోగ్యమా?. ప్రజాస్వామ్యంలో దీన్ని అనుమతించవచ్చా?. భారత రాజ్యాంగం ఇటువంటి జీహాద్‌ను అనుమతిస్తుందా? అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌ కుట్ర ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవాలంటే, పార్టీని వీడిన నేతల మాట వినాలని ప్రధాని అన్నారు. రామమందిరానికి వెళ్లినందుకు తనను తీవ్రంగా హింసించారని, అందుకే ఓ మహిళ కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని ఓ మహిళ చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌లో ముస్లింలీగ్‌, ఉగ్రవాదులు నిండిపోయారని మరో వ్యక్తి చెప్పారని అన్నారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును రాజీవ్‌ గాంధీ తోసిపుచ్చినట్లే, రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ షాజాదా (రాహుల్‌ గాంధీ) భావిస్తున్నారని మరో వ్యక్తి చెప్పారని అన్నారు. ఇవి ఎవరూ చెప్పిన దాఖలాల్లేవు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ వాట్సప్‌ ఫ్యాక్టరీల్లో పుట్టినవేనని విశ్లేషకుల అభిప్రాయం.

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూయాదవ్‌పై కూడా దాడి చేశారు. పశుదాణా కుంభకోణంలో జైలుపాలైన నేత ముస్లింలు రిజర్వేషన్లు పొందాలని, మొత్తం రిజర్వేషన్లు ముస్లింలకే చెందాలని అంటున్నారని అన్నారు.

➡️