చెత్తపన్ను రద్దు చేస్తాం

Apr 29,2024 23:50 #2024 election, #chandrababau, #meeting
  • భూములు కొట్టేయడానికి ప్రణాళిలు సిద్ధం చేశారు
  •  ప్రజాగళం సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి -గూడూరు, కర్నూలు ప్రతినిధి : అధికారంలోకి రాగానే సిపిఎస్‌పై నిర్దిష్ట విధానం తీసుకొస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని, పిఆర్‌సి వేసి ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్‌, నందికొట్కూరులో నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ఐదేళ్లు బటన్‌ నొక్కే పేరుతో నాటకాలు ఆడారని విమర్శించారు. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకు, అభివృద్ధికి సవాల్‌ అని, ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటమని తెలిపారు. జగన్‌కు అహంకారం ఎక్కువైందని, వ్యవస్థలన్నీ నాశనం చేశారని విమర్శించారు. ప్రజల జీవితా లను చితికిపోయేలా చేసిన దొంగ వారిని వదిలిపెడదామా? అని ప్రశ్నించారు. శాశ్వతంగా ఉండిపోదామని అనుకున్నా రని, మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలని మరిచిపోయారని విమర్శించారు. పరదాలు కట్టుకు తిరిగిన వ్యక్తి ఎన్నికల ముందు ప్రజల దగ్గరకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సచి వాలయానికి రాని వారు ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాయలసీమకు ఏమైనా చేశారా? ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక పరిశ్రమ అయినా తెచ్చారా? మరి ఎందుకు వారికి ఓటేయాలని ప్రశ్నించారు. భూములన్నీ జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని, భూములు కొట్టేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే ఎపి లిక్కర్‌ స్కాం ఇంకా పెద్దదని చెప్పారు. బిసిలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను ఇస్తామని, తమది సామాజిక న్యాయమని, జగన్‌ ది సామాజిక ద్రోహమని చెప్పారు. టిడిపి ప్రభుత్వంలో ముస్లింలకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు చేయిస్తామని, వికలాంగులకు రూ. ఆరువేల పింఛను ఇస్తామని, ఇసుక అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

ఇంటి వద్దే పింఛను ఎందుకివ్వడం లేదు?
ఇంటి వద్దే సామాజిక పింఛను పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. గూడూరు బస కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.26 లక్షల సచివాలయం సిబ్బంది, 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, ఐదు వేల మంది వెలుగు సిబ్బంది, ఐదువేల మంది వ్యవసాయ సిబ్బంది, మూడు వేల మంది హార్టికల్చర్‌ సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నారని…వీళ్లందరితో పంపిణీ చేయిస్తే ఒక్కొక్కరు 45 మందికి పింఛను పంపిణీ చేసినా ఒక్కరోజులోనే అందరికి పంపిణీ చేయవచ్చన్నారు. వలంటీర్లతో పింఛను పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పిందని, కానీ వితండ వాదంతో ప్రభుత్వం పింఛన్ల పంపిణీని రాజకీయం చేస్తోందని చెప్పారు. పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సిఎస్‌, గవర్నర్‌, ఎన్నికల కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని, గత ఘటనలు పునరావృతం కాకుండా పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్‌ కూడా చెప్పిందని అన్నారు.

➡️