అన్నార్తులపై అరివీర ప్రతాపాలు

Mar 5,2024 08:45 #sahityam

మది కాని పోరులో

శిధిలమైన ఊరిలో..

మిగిలివున్న చూరు కింద

పగటి కలల పౌరుడు

పక్కలోన బాంబు పడ్డా

చెక్కు చెదరని ఆశతో

తనువు చిక్కి శల్యమైనా

చిక్కనైన నవ్వుతో

చక్కగా కలగంటున్నాడు

ఎండివున్న డొక్కకు

ట్రక్కులతో తిండి దొరికినట్టు

డస్సిన దేహానికి దప్పిక తీరినట్టు

ఒక్కడి కల కాదిది.. ఊరుమ్మడి కల

నిస్సహాయ సమూహాలకు

నిషిద్ధమైన కల

కలలు నిండిన కళ్ళ ముందు

కుట్రక్కు ఉరికి వచ్చినపుడు

మూకుమ్మడిగా ఆకలి,

చేయిచాచి ముందుకొచ్చే

వేల కొలది ప్రేవులన్నీ

ఆవురావురుమని పెనుగులాడే

చేతికి చేరనే లేదు తిండి పిండి పొట్లాలు

గుండెను తూట్లు పొడిచేను యుద్ధ సేన తూటాలు

అన్నార్తులపై అరివీర ప్రతాపాలు

ఆకలి తీరిందేమో విగత జీవి దేహాలకు

అయినా రక్తదాహం తీరనే లేదు ఆ ‘ఆధునిక’ దేశాలకు.

– డా|| డి.వి.జి.శంకరరావు,మాజీ ఎంపీ.సెల్‌ : 9440836931( ఆహార పదార్థాల కోసం సహాయక ట్రక్కుల వెనక పరుగులు పెట్టిన గాజా పౌరులపై ఇజ్రాయిల్‌ కాల్పులు జరపగా 100 మంది మృతి చెందారన్న వార్త చదివి…)

➡️